రాష్ట్రపతి పాలన విధించడం అంటూ జరిగితే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్టే అర్థం. ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఉండి ఉండాలి. రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు చేయిదాటి పోయాయని భావిస్తే రాష్ట్రపతి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలి. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించిన చర్చే ప్రధానంగా నడుస్తోంది. ఇందుకు కారణం హైకోర్టు. హైకోర్టు రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయనే అనుమానంతో పరిశీలన చేస్తామని వ్యాఖ్యానించింది. దీంతో జగన్ ప్రభుత్వం మీద పిడుగు పడ్డట్టైంది. హైకోర్టు ఇలా ప్రభుత్వాన్ని రద్దుచేసే అవకాశాన్ని ఓపెన్ చేయడంతో జనంలో కూడ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది.
వైఎస్ జగన్ అనేక పథకాలు పెట్టి లబ్దిదారులకు బోలెడంత డబ్బు పంచుతున్నారు. అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన ఎందుకని. అయితే ఇక్కడ సమస్య సంక్షేమ పథకాల అమలు కాదు. పాలన తీరు. ప్రభుత్వానికి, కోర్టుకు ఇప్పటికే అనేక అంశాల్లో వివాదాలు రేగాయి. కోర్టు తీర్పులను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టడంతో హైకోర్టు కూడ సీరియస్ అయింది. రాజ్యాంగ వ్యవస్థలు అంటే లెక్కలేదా, కోర్టు ధిక్కరణకు పాల్పడతారా అంటూ మండిపడింది. మరొక రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమీషన్ విషయంలో కూడ నిమ్మగడ్డతో జగన్ ప్రభుత్వానికి నడుస్తున్న గొడవల సంగతి అందరికీ తెలుసు. ఇప్పటికీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా టీడీపీ నేత ఒకరు ప్రభుత్వం తమకు నిరసన తెలిపే స్వేచ్ఛను ఇవ్వట్లేదని పిటిషన్ వేయగా ఇంకొందరు మాత్రం పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తున్నారని, దాచిపెట్టినవారిని బహిరంగపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన హైకోర్టు అక్రమ నిర్బంధనలు తగవని డీజీపీకి చెప్పినా ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రాజ్యాగా వ్యవస్థల విచ్ఛిన్నం జరుగుతున్నదా అనేది అంశమై పరిశీలన చేస్తామని అంది. ఒకవేళ హైకోర్టు పరిశీలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిజంగానే విచ్ఛిన్నం అవుతున్నాయని తేలితే ఆర్టికల్ 356 మేరకు రాష్ట్రపతి పాలన విధించబడవచ్చు. దీంతో ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసింది.
కోర్టులు తమ ముందుకు వచ్చిన పిటిషన్లను మాత్రమే విచారించాలి తప్ప మిగతా వాటిని ఎలా విచారిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది, పైగా పిటిషనర్లు ఎవరూ కూడ రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయి పరిశీలించండి అని కోరలేదు. అలాంటప్పుడు ఇలాంటి పరిశీలన ఎలా చేస్తారని ప్రశ్నించగా జైకోర్టు తన ముందే తన నిర్ణయాన్ని సవాల్ చేస్తారా, కావాలంటే సుప్రీం కోర్టుకు వెళ్ళమని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఢిల్లీ బాట పట్టింది. వెంటనే రాజ్యాంగ విచ్ఛిన్నం అనే అనుమానంతో జరపబోయే పరిశీలనను ఆపాలని అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాలని డిసైడ్ అయింది. మరి సుప్రీం హైకోర్టు వ్యాఖ్యలను సమర్ధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జగన్‌కు అయితే ఇదో కొత్త టెంక్షన్ అన్నట్టు తయారైంది వ్యవహారం.