ఎన్నికల కమీషనర్ అంటే ఏడాది క్రితం వరకు ప్రజలకు, పాలకులకు పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ నిమ్మగడ్ద రమేష్ కుమార్ వ్యవహారంతో ఆ పదవి మీద అందరి దృష్టీ పడింది. ఈసీ అడ్డం తిరిగితే ప్రభుత్వం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో చూపించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ చేసేది తప్పా ఒప్పా అనేది పక్కనబెడితే ఈసీ పదవిలో ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఎంత రాద్ధాంతం జరుగుతుందో గత 10 నెలలుగా ప్రత్యక్షంగా చూస్తున్నారు జనం. గతంలో ఏ ముఖ్యమంత్రీ కూడ ఈసీ విషయంలో అంత పట్టుదలతో ఉండేవారు కాదు. ఆ పదవిలో తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకోవాల్సిన అవసరం ఎవరికీ కనబలేదు.
కానీ జగన్ కష్టాలను చూశాక ఈసీ కూడ మనవాడే అయ్యుండాలనే ధోరణి మొదలైంది. జగన్ సాదా సీదాగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యర్థి పార్టీలను చిత్తు కింద కొట్టేసి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడ అదే తరహా దూకుడును చూపిస్తున్నారు. అలాంటి వ్యక్తినే నిమ్మగడ్డ కిందా మీదా చేసేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలై కొన్ని ఏకగ్రీవాలు జరిగిపోయాక కరోనా పేరు చెప్పి ఎన్నికలను రద్దుచేసేసి జగన్ కు తలనొప్పి తెచ్చిన నిమ్మగడ్డ ఇప్పటికీ అదే ట్రెండ్ సాగిస్తున్నారు. ప్రభుత్వం మొత్తం ఏకమైనా కూడ ఆయన్ను బెదరగొట్టలేకపోతున్నారు.
ఈ యుద్ధంలో చివరి విజయం ప్రభుత్వానిదే అయినా నిమ్మగడ్డను ఇప్పట్లో మర్చిపోలేరు జగన్. ఆయనిచ్చిన ట్రీట్మెంట్ కారణంగా ఈసారి పదవిలో ఉండబోయే వ్యక్తి తమకు అనుకూలమైన, సహకరించే వ్యక్తే అయ్యుండాలి జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఈసీగా తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నీలం సాహ్ని సీఎస్ బాధ్యతల్లో ఉంది ప్రభుత్వానికి ఎంతగానో సహకరించారు. కోర్టుల విషయంలో ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. తన పరిధిలోని అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి మార్గాలను సుగమం చేశారు. ఆమె పనితీరు నచ్చే పలుమార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు జగన్.
ఆ నమ్మకంతోనే ఏప్రిల్ నెలలో నిమ్మగడ్డ పదవి నుండి దిగిపోగానే ఆమెను కోర్చోబెట్టాలని భావిస్తున్నారట. ఆమే గనుక ఆ పదవిలోకి వస్తే ఎన్నికల సంఘంతో ప్రభుత్వానికి మంచి తోడ్పాటు వాతావరణం ఏర్పడుతుంది. జగన్ ఒక్కరే కాదు నిమ్మగడ్డ ఎపిసోడ్ చూసిన అందరు నాయకులు, అన్ని పార్టీలు ఈసీ విషయంలో కూడ జాగ్రత్తగానే ఉండాలని, అనుకూలమైన వారినే నియమించుకోవాలని భావిస్తున్నారు.