వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ లెక్కల్లో 80 శాతానికి పైగా స్థానాలు వారి కైవసమైనట్టు చెబుతున్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకొన్ని ఎక్కువ స్థానాలు వచ్చేవని అంటున్నారు. వచ్చేవి అంటున్న వాటి సంగతి పక్కనబెడితే వచ్చిన స్థానాల గురించి మాట్లాడుకుంటే అక్కడ జగన్ కు కంగారుగానే ఉందనేది పరిశీలకుల మాట. ఎందుకంటే వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేశామని చెప్పుకుంటున్న పాలన గొప్పలు బట్టి అన్ని పంచాయతీలను ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలి. కానీ చేయలేకపోయింది. సాధారణంగా అధికార పార్టీ చూపించే ఆధిక్యతనే చూపించింది తప్ప కొత్తగా రికార్డులేమీ లేవు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఇవి నామమాత్రపు విజయాలు మాత్రమే.
అమ్మఒడి, పింఛన్ పెంపు, వాలంటీర్ వ్యవస్థ, జగనన్న ఆసరా, బీసీ వర్గాల కోసం పేద ఎత్తున ఖర్చు చేశామనే మాటలు, భారీ సంఖ్యలో కార్పొరేషన్లు ఇలాంటి పనులన్నీ ప్రజల్లో పార్టీ ప్రతిష్టను విపరీతంగా పెంచాయని జగన్ సహా వైసీపీ నాయకులందరూ అంటూ వచ్చారు. జగన్ జనంలో దేవుడయ్యారని, ఈసారి ఎన్నికల్లో మరొక పార్టీ అంటూ ఉండదని అంటూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో సీన్ వేరుగా ఉంది. జగన్ ఆశించినట్టు, అనుకుంటున్నట్టు సంక్షేమ పథకాలు జనంలో అంత భారీగా ఆదరణ పొంది ఉన్నట్టైతే పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవి వైసీపీకి. కానీ ఫలితాల్లో సంక్షేమ పథకాల ఎఫెక్ట్ పెద్దగా కనబడినట్టు లేదు.
అంటే జగన్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేస్తున్న సంక్షేమం జనం మీద పెద్దగా ప్రభావం చూపలేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ పట్టు నిలుపుకునే ఉందని రూఢీ అయింది. ఇదే పరిస్థితి గనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనబడితే జగన్ చేస్తున్న సంక్షేమం ఓటు బ్యాంకుకు గండిపడ్డట్టే అవుతుంది. అదే ప్రతిపక్షానికి మేలు చేసే అంశమవుతుంది. మరోవైపు ఒక వర్గం ప్రజలు అభివృద్ధి మాటేమిటని నిలదీస్తున్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేక ఓటు బ్యాంకుగా మారే ప్రమాదముంది. కనుక పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సాధించినా ఆశించిన ఫలితం దక్కకపోవడం బ్యాడ్ ఇండికేషన్ అనే అనుకోవాలి.