వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ప్రధానంగా అవినీతి అనేది తన పాలనలో కనిపించకూడదనేది జగన్ సంకల్పం. ఆరంభంలోనే తన పాలనలో అవినీతి మూలంగా ప్రజలెవరూ ఇబ్బందిపడకూడదనేది తన ప్రధాన లక్ష్యమని జగన్ బలంగా చెప్పారు. పలు సందర్భాల్లో తమ పాలనకు, చంద్రబాబు నాయుడు పాలనకు స్పష్టమైన తేడా చూపుతామని, అవినీతి జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని మాటిచ్చారు. అవినీతి నిర్మూలనకే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవినీతి ప్రధానంగా సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వ సంబంధిత కార్యాలయాల్లో జరుగుతుంటుంది. అందుకే వాలంటీర్ వ్యవస్థ ఏర్పరచి సేవలన్నింటినీ ప్రజల వద్దకే అందించాలని సంకల్పించారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా పెద్ద లీడర్ల మీదే ఈ ఆరోణలు రావడంతో జగన్ సైతం విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల్లో నేతలు చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరిస్తున్న భూములను నేతలు ముందుగానే కొనుగోలు చేసి ప్రభుత్వానికి అధిక ధరకు అమ్ముతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. స్థలాల మంజూరుకు ప్రజల నుండి కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుగారే ఈ కమీషన్ల గురించి మాట్లాడారు. ఇక ఇసుక మాఫియా, సిమెంట్ మాఫియా, లిక్కర్ మాఫియా ఎదేచ్ఛగా నడుస్తున్నాయని విమర్శలు వచ్చాయి.
పిఐఎల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అశ్వినీకుమార్ ఉపాధ్యాయ కూడ ఏపీలో అవినీతి జరుగుతోందని ఆన్నారు. దీన్నిబట్టి విషయం అర్థమవుతూనే ఉంది. జగన్ ఒకవైపు అవినీతి మరకలు వద్దనే వద్దని అంటుంటే కొందరు నేతలు మాత్రం వాటిని పెడచెవిన పెట్టి చేయాల్సింది చేస్తున్నారట. ఈ విషయాలన్నీ గమనించిన సీఎం ఆరోపణలు వస్తున్న వారి మీద ప్రత్యేక నిఘా ఉంచారని, గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ మొత్తం ఆయన వద్ద ఉందని రాజకీయవర్గాల్లో టాక్. సీఎం తెప్పించుకున్న రిపోర్ట్ చూసి ఎవరెవరు ఏ స్థాయిలో తప్పు చేస్తున్నారో గమనించి నేరుగా వారినే పిలిపించుకుని హెచ్చరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి నిజానిజాలు ఏమిటో చెప్పలేం కానీ అవినీతి జరిగితే మాత్రం సీఎం జగన్ ఎవ్వరినీ ఉపేక్షించరనేది మాత్రం ఖచ్చితం.