వైఎస్ జగన్ ఆయన సోదరి షర్మిల ఇద్దరూ గట్టివారే. తండ్రి వైఎస్ఆర్ నుండి రాజకీయ గుణాలను పుణికిపుచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపును సాధించారు. వైఎస్ కుమారుడిగా కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ఆరంభించిన జగన్ ఆ పార్టీతోనే విభేదించి చివరకు సొంత పార్టీ పెట్టుకుని అష్టకష్టాలు పడి ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. వైఎస్ మరణించాక జగన్ రాజకీయ జీవితం నిప్పుల మీద నడక అన్నట్టే సాగింది. అయినా సాహసంతో ముందడుగేశారు జగన్. అదే ఆయనను ఈరోజు సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది. ఇక షర్మిల కూడ అన్నకు తగ్గ చెల్లెలే. ఒకానొల్ల దశలో వైసీపీ భారం మొత్తాన్ని ఒంటరిగానే మోశారు షర్మిల.
జగన్ పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ నెలలపాటు జైలులో ఉండిపోతే షర్మిల ముందుకొచ్చి పార్టీ పగ్గాలు అందుకున్నారు. అన్నకు మద్దతుగా రాష్ట్ర పర్యటన చేపట్టారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పార్టీని నడిపారు. అప్పట్లో ఆమె చురుకుదనం చూసి జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిల ఉపముఖ్యమంత్రి లేదా కనీసం మంత్రి అని, పార్టీలో నెంబర్ 2 ఆమేనని అనుకున్నారు అందరూ. కానీ జగన్ బయటకు రావడంతోనే షర్మిల తెరమరుగైపోయారు. ప్రత్యక్ష రాజకీయాలు నుండి మెల్లగా దూరం జరిగేశారు. రాజకీయాల మీద ఎంతో ఆసక్తి కలిగిన షర్మిల ఉన్నట్టుండి మాయమవడంతో జగన్ మీద విమర్శలు మొదలయ్యాయి. పార్టీ తన ఒక్కడికే సొంతమని జగన్ షర్మిలను వెనక్కు నెట్టేశారని ప్రత్యర్థులు ప్రచారం స్టార్ట్ చేశారు.
తాజాగా కూడ అదే తరహా ప్రోపగాండా నడుస్తోంది. కొన్నిరోజులుగా జగన్ షర్మిలకు తెలంగాణ వైసీపే బాధ్యతలను అప్పజెబుతారని, త్వరలోనే ప్రకటన ఉంటుందనే వార్తలు జోరుగా వినబడ్డాయి. కానీ తాజాగా జగన్ ఇంట జరిగిన క్రిస్మస్ వేడుకలకు షర్మిల రాకపోవడంతో అన్నా చెలెళ్ల మధ్యన తీవ్ర స్థాయి విభేదాలున్నాయని, శతృవుగా మారిపోయారని ఎల్లో మీడియా కథనాలు స్టార్ట్ చేసింది. ఈ విషయం మరెవరో కాదు జగన్ సొంత జిల్లా కడప వాసులే చెప్పుకుంటున్నారట. లేకపోతే జగన్ తో క్రిస్మస్ వేడుకలను ఏనాడూ మిస్సవని షర్మిల ఈసారి ఎందుకు మిస్సయ్యారు అంటూ లాజిక్కులు పడుతున్నారు. నిజానికి షర్మిల క్రిస్మస్ సందర్బంగా అమెరికాలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లారట. అందుకే జగన్ వద్దకు వెళ్లలేకపోయారట. కానీ పచ్చ మీడియా మాత్రం జగన్, షర్మిల శత్రువులయ్యారని అంటోంది.