జగన్ పై దాడి కేసులో వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయం

జగన్ పై దాడి కేసులో వైసీపీ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ నెల 25 న విశాఖ ఎయిర్పోర్టులో తమ అధినేత జగన్ పై దాడి ఘటనపై విచారణ జరిపించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ దాడి జరిగినప్పటి నుండి జగన్ మరియు పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. దాడిపై అధికార ప్రభుత్వం కుట్ర కూడా ఉందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యూడిషియల్ విచారణ కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజనాధ్ సింగ్ తో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, వరప్రసాద్, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు.

అంతేకాదు రాష్ట్రపతి రాజనాధ్ కోవింద్ అపాయింట్మెంట్ కూడా వారు కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. సోమవారం లేదా మంగళవారం రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు నేతలు. మరో రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులను, ఇతర నేతలను కలవాలని వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ పై దాడి ఘటనలో సిట్ విచారణ చేపడుతోంది. ఇప్పటికే నిందితుడి శ్రీనివాస్ కు సంబంధించిన పలు కీలక విషయాలను బయటపెట్టింది సిట్. సోమవారం శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్స్ ను పరిశీలించనుంది సిట్. వారి ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న సిట్ వాటిపై దర్యాప్తు చేపట్టింది. శ్రీనివాస్ ఫోన్ కాల్ డేటా సైతం సిట్ విచారించనుంది.

ఇదిలా ఉండగా జగన్ పై దాడి జరిగిన నాటి నుండి అధికార, ప్రతిపక్షాలు వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. శ్రీనివాస్ మీవాడంటే, మీవాడంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. జగన్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అధికార పార్టీ కుట్ర పన్నిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలవలేమని భయంతో వైసీపీ శ్రేణులే సింపతీ కోసం డ్రామా చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా జగన్ పై దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలకు అంతు చిక్కని ముడిలా మారింది.