చంద్ర‌బాబు కంచుకోట‌లో జ‌గ‌న్ మ‌లి అడుగు?

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రి కొద్దిరోజుల్లో ముగియ‌బోతోంది. ఈ నెల 9న ఇచ్ఛాపురంలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌తో జ‌గ‌న్‌.. త‌న 14 నెల‌ల పాద‌యాత్ర‌ను ముగించ‌బోతున్నారు.పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే ఆయ‌న బ‌స్సు యాత్ర‌ను చేప‌ట్ట‌బోతున్నారు.
అంద‌రూ ఊహిస్తున్న‌ట్టుగా జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ఇడుపుల పాయ నుంచి ఉండ‌క‌పోవ‌చ్చు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న కుప్పం నుంచి బ‌స్సు యాత్ర‌ను ఆరంభించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.ఈ మేర‌కు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు స‌మాచారం అందిన‌ట్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ త‌రువాత జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు శ్రీ‌కారం చుడ‌తార‌ని పార్టీ వ‌ర్గాలు సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డిస్తున్నాయి. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌పై త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వాస్త‌వానికి- జ‌గన్‌..తాను ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టినా దానికి ఇడుపుల పాయ నుంచే మొద‌లు పెడ‌తారు. ఇడుపుల పాయ‌లో ఉన్న దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి స‌మాధి వ‌ద్ద ప్రార్థ‌న‌ల‌ను నిర్వ‌హించిన అనంత‌రం ఏ కార్య‌క్ర‌మాన్న‌యినా చేప‌డ‌తారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కూడా ఆయ‌న ఇడుపుల పాయ నుంచే ఆరంభించారు.

దీనికి భిన్నంగా.. జ‌గ‌న్ ఈ సారి త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి నియోజ‌క‌వ‌ర్గంపై గురి పెట్టారు. కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌స్సు యాత్ర‌ను ఆరంభించ‌డానికి స‌న్నద్ధ‌మ‌వుతున్నారు. బ‌స్సు యాత్ర ఆరంభం సంద‌ర్భంగా కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్టీలోకి కొన్ని చేరిక‌లు కూడా ఉండొచ్చ‌ని వైఎస్ఆర్ సీపీ నాయ‌కులు చెబుతున్నారు.