పోటీపై  రాజమండ్రి ఎంపి సంచలన నిర్ణయం

అవును రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాజమండ్రి టిడిపి ఎంపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకూ టికెట్ విషయంలో స్పష్టంగా ఉన్న ఎంపి మురళీమోహన్ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో మురళీ మోహన్ కానీ లేకపోతే ఆయన కోడలు రూప కానీ పోటీ చేయటం ఖాయమనే అనుకున్నారు. ఎంపి కూడా తామిద్దరిలో ఎవరో ఒకరం పోటీలో ఉంటామని అనేక సందర్భాల్లో చెప్పారు.

అలాంటిది ఏమైందో ఏమో ఎవరికీ తెలీదు. తాను పోటీ చేయబోవటం లేదని పార్టీ నేతలతో మురళీమోహన్ స్పష్టంగా చెప్పారట. తానే కాదని తన కోడలు రూప కూడా పోటీ చేయబోవటం లేదని కూడా తేల్చి చెప్పారట. దాంతో ఎంపి నిర్ణయం విన్న నేతలకు షాక్ కొట్టినట్లైంది. దాదాపు ఐదేళ్ళుగా ఎంపి తరపున కోడలు రూపే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయటం ఖాయమని అందరికీ అర్ధమైపోయింది. ఇటువంటి నేపధ్యంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో పోటీ నుండి తప్పుకోవాలన్న ఎంపి నిర్ణయం ఆశ్చర్యంగా ఉంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాజమండ్రి లోక్ సభ పరిధిలో పార్టీ పరిస్ధితిపై ఎంపి సొంతంగా సర్వే చేయించుకున్నారట.  మామూలుగానే ఎంపిపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉంది. దానికితోడు చంద్రబాబునాయుడు పాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత తోడైంది. నిజానికి నియోజకవర్గం మొత్తం మీద బిసిలు ప్రధానంగా గౌడ్లు, శెట్టి బలిజల ఓట్లే ఎక్కువ.

అయితే, ప్రత్యేక పరిస్ధితుల్లో పోయినసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన మురళీ గెలిచారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో తన గెలుపు కష్టమని ఎంపికి సర్వే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దాంతో ఓడిపోయే సీటులో కోట్ల రూపాయల ఖర్చు అనవసరమని భావించే పోటీ నుండి తప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాకపోతే చంద్రబాబు ఏమంటారో చూడాలి