సిఎం రమేష్ ఇరుక్కున్నట్లేనా ?

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇరుక్కునట్లేనా ? ఇపుడందరిలో అవే అనుమానాలు మొదలయ్యాయి.  శుక్రవారం ఉదయం నుండి రమేష్ ఇళ్ళు, కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్ళపైన కూడా ఏకకాలంలో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల అర్ధరాత్రికి సోదాలు పూర్తవ్వగా మరికొన్ని చోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత సోదాలు మొదలయ్యాయి. మొత్తానికి పక్కా సమాచారంతోనే ఐటి అధికారులు ఏకకాలంలో దాడులకు దిగినట్లు అర్ధమవుతోంది.

 

ప్రధానంగా రాజ్యసభ సభ్యుడు కాకముందు రమేష్ ఆస్తులు, వ్యాపారలతో పాటు మొదటిసారి, రెండోసారి రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత ఆస్తులు, వ్యాపారాల్లో  పెరుగుదలపైనే ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. అందులోను 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగిన ఆస్తులు, వ్యాపారాలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారట. ఆస్తులు, వ్యాపారాల్లో పెరిగిన వ్యత్యాసాన్ని కూడా గమనించారని సమాచారం. 2013-14లో రూ 55 కోట్లుగా ఉన్న రిత్విక్ ప్రాపర్టీస్ ఆదాయం 2016-17 అంటే కేవలం 2 ఏళ్ళల్లోనే 145 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారట.

 

అదే విధంగా చంద్రబాబు సిఎం అయిన తర్వాత రమేష్ తన తమ్ముడి పేరుతో 10 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వివిధ రకాల్లో భారీ మొత్తాలను ఈ డొల్ల కంపెనీలకు దారి మళ్ళించినట్లు కూడా అధికారులు గుర్తించారట. అదే విధంగా శనివారం ఉదయం బ్యాంకు లాకర్లను తెరిచినపుడు భారీ ఎత్తున బంగారు నగలు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రమేష్ కు సుమారు 19 ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల కాంట్రాక్టులు దక్కాయి. అందులో కొన్నింటిని టేకప్ చేసేందుకు రమేష్ కంపెనీలకు అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు దక్కటం విశేషం.

 

ఇక, రమేష్ పై సొంత పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రొద్దుటూరు మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి మధ్య బద్దవిరోధముంది. రమేష్ పై వరదరాజులు ఎప్పుడు మాట్లాడినా ఎంపి అక్రమ సంపాదనపైనే ఆరోపణలు చేసేవారు. రమేష్ వ్యాపారాల్లో అనూహ్య పెరుగుదలపై 2009లోనే వైఎస్ విజయమ్మ హై కోర్టులో కేసు వేశారు.

 

2003లో రూ 61 కోట్లున్న కంపెనీ ఆదాయం 2009కి రూ 488 కోట్లకు చేరుకోవటంపై విజయమ్మ అనుమానాలు వ్యక్తం  చేస్తు కోర్టులో కేసు వేశారు. మరి ఏమైందో ఏమో కానీ రమేష్ కంపెనీలపై విచారణకు కోర్టు అంగీకరించలేదు. ఇపుడు ఐటి దాడులతో చాలా విషయాలు వెలుగు చూడనున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబు అండ్ కో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. షెల్ కంపెనీల ఏర్పాటు, కోట్లాది రూపాయల దారిమళ్ళింపు, వ్యాపారాల్లో అనూహ్య పెరుగుదల తదితరాలతో రమేష్ ఇరుక్కున్నట్లేనా అని అనుమానం కలుగుతోంది.