టిడిపికి ఎన్ని మైనెస్సులెనున్నాయో తెలుసా ?

ఏ పార్టీకైనా గట్టిగా మద్దతుగా నిలబడే నియోజకవర్గాలు చాలా అవసరం. ఆ విషయంలో తెలుగుదేశంపార్టీది చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే, 1982లో టిడిపి పెట్టినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకూ కంచుకోటలుగా గట్టి మద్దతునిచ్చే నియోజకవర్గాలు సుమారు 45 ఉన్నాయి. అంటే చంద్రబాబు లెక్క 45 అసెంబ్లీ స్ధానాల నుండి మొదలవుతాయన్న మాట. తెలుగు రాష్ట్రాల్లో ఇంత స్ధాయిలో కంచుకోటలుగా చెప్పుకోదగ్గ నియోజకవర్గలు మరో పార్టీకి లేవనే చెప్పాలి. పార్టీ వ్యవస్దాపకుడు ఎన్టీయార్ వేసిన ఫౌండేషన్ చంద్రబాబుకు అలా అచ్చొచ్చిందన్నమాట.

ఇప్పటి వరకూ చంద్రబాబు ప్లస్ ల సంగతే మాట్లాడుకున్నాం. మరి మైనస్ ల సంగతేంటి . ప్లస్సులున్నపుడు మైనస్సులు కూడా ఉంటాయిగా ? అవేంటో చూద్దాం. కంచుకోటలుగా చెప్పుకునే 45 నియోజకవర్గాలు టిడిపికి ఎంత ప్లస్సో ఫిరాయింపు నియోజకవర్గాలు అంతే మైనస్సుగా నిలవబోతున్నాయి. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. కానీ అదే ఫిరాయింపులు రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 ఎలాగంటే , చంద్రబాబు చూపించిన ఏవో ప్రలోభాలకు లొంగిపోయి వైసిపి నుండి ఫిరాయించారు కానీ టిడిపిలో చేరిన దగ్గర నుండి పాపం వారి భ్రతుకు చాలా దుర్భరంగా తయారైంది. వైసిపిలో ఉన్నంత వరకూ బాగా ఆధరించిన జనాలు ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో వాళ్ళ నియోజకవర్గాల్లో చీత్కారాలను ఎదుర్కొంటున్నారు. ఆ విషయం చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకనే ఫిరాయింపుల్లో ఎంతమందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లిస్తారో అనుమానమే. ఫిరాయింపులకు టిక్కెట్లిచ్చినా ఇవ్వకపోయినా 23 ఫిరాయింపు నియోజకవర్గాల్లో టిడిపికి వ్యతిరేక గాలి వీస్తోందన్నది వాస్తవం. కాబట్టి ఆ నియోజకవర్గాలు టిడిపికి పెద్ద మైనస్సనే చెప్పాలి.

అదే సమయంలో నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై చాలా సామాజికవర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. బిసిల్లో చేరుస్తానని హామీ ఇచ్చి తప్పినందుకు కాపులు మండుతున్నారు. ఆర్దికంగా గట్టి స్ధితిలో ఉన్న కాపులను బిసిల్లోకి చేరుస్తానని హామీ ఇచ్చినందుకు బిసిలూ మండిపోతున్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలకు పూర్తిస్ధాయి రుణాలు మాఫీ కాకపోవటంతో వాళ్ళూ కారాలు మిరియాలు నూరుతున్నారు. పోయిన ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన బిజెపి, పవన్ ఇప్పుడు చంద్రబాబును వదిలేసి సొంత కుంపటి పెట్టుకున్నాయి.

 

ఇక, ఆడవాళ్ళపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్ ఇందులో భాగమే. ఇసుక, మట్టి దోపిడితో పాటు అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. రాజధాని రైతులతో పాటు కౌలు రైతులు కూడా మండిపోతున్నారు. ఇలా కారణమేదైనా ప్రభుత్వంపై చాలా వర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. కాబట్టి ఇప్పటి వరకూ టిడిపిని కాపాడుతున్న కంచుకోటల్లో రేపటి ఎన్నికల్లో ఎన్ని బద్దలవుతాయో తెలీదు. ఇవన్నీ చంద్రబాబుకు మైనస్సులే కదా ? ఎవరికైనా అనుమానాలున్నాయా ?