ఆయనది విశాఖపట్నం కాదు. కానీ, విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు నడపగలరు. విశాఖ సహా ఉత్తరాంధ్ర వ్యవహారాల్ని విజయసాయిరెడ్డి చూసుకున్నంతకాలం వైసీపీకి అక్కడ తిరుగు లేకుండా పోయింది. కానీ, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో, ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్నారో.. వైసీపీలో నిర్లక్ష్యం పెరిగిపోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారానికొస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తంగా పార్టీ నాశనమైపోయిందన్న చర్చ జరుగుతోంది. అదే విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించి వుంటేనా.? అంటూ ఉత్తరాంధ్ర వైసీపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఆస్కారం లేనంతగా వైసీపీ ఉత్తరాంధ్రలో డ్యామేజీకి గురయ్యింది. వేవ్ స్పష్టంగా కనిపిస్తోందక్కడ. ఆ వేవ్ వైసీపీకి వ్యతిరేకంగా షురూ అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు రచించి, మళ్ళీ ఉత్తరాంధ్రలో పూర్వ వైభవం పార్టీకి తీసుకొస్తారోగానీ, ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర వైసీపీలో పూర్తి స్తబ్దత ఏర్పడింది.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. వైసీపీలో చాలామంది కీలక నేతలున్నారు ఉత్తరాంధ్ర నుంచి. వీళ్ళెవరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకోవడంలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, ‘మాకేం నష్టం లేదు.. ఏదో ఘోరం జరిగిపోయిందనుకోకూడదు..’ అంటూ లైట్ తీసుకున్నారు.
అన్నీ అధినేత చూసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. పాలనా వ్యవహారాలు చూసుకుంటూ, పార్టీ వ్యవహారాలూ మొత్తంగా తానే చక్కబెట్టాలంటే కుదరని పని. బాధ్యత తీసుకునే నాయకులు లేకపోతే, వైసీపీ ఎలా ఎదిగిందో, అలాగే పతనైపోయే ప్రమాదముంది.