ప్రకాశం జిల్లా వైసిపిలో ఊహించని ట్విస్ట్

 

ప్రకాశం జిల్లా వైసిపిలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైసిపి లో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూడా ఇంచార్జిల మార్పు జరగనుంది. గత కొంతకాలంగా దర్శి ఇంచార్జి బాదం మాధవరెడ్డి వైసిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈమధ్య కాలంలో జిల్లా ఇంచార్జిలతో జగన్ భేటీకి కూడా బాదం మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో దర్శికి మరో సమన్వయకర్త కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి ఎవరూ ఊహించని విధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు వినబడుతోంది.

నిజానికి శివప్రసాద్ రెడ్డి 2019 లో పోటీ చేయను అని తెలిపాకే బాదం మాధవరెడ్డిని దర్శి నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించింది అధిష్టానం. కాగా బాదం మాధవరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ బూచేపల్లి పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. కొంతకాలం క్రితం బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి జగన్ ను కలిసి రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయను అని తెలిపారు. కుటుంబ బాధ్యతలు పెరగడం, ఎన్నికల్లో ఆర్థికపరమైన అంశాలు అందుకు కారణంగా చెప్పినట్టు సమాచారం.

అయితే ఒకే నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఉద్దేశ్యంతో తనకు ఆప్తుడైన శివ పోటీ చేయలేనని చెప్పడంతో ఆ స్థానంలో బాదం మాధవ్ రెడ్డిని నియమిస్తున్నట్టు ప్రకటించారు. కానీ మాధవరెడ్డి పార్టీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు.ఈ తరుణంలో బాదం స్థానంలో బలమైన ఇంఛార్జిని నియమించాలని కసరత్తు చేసింది వైసిపి అధిష్టానం. ఈమేరకు బూచేపల్లిని రానున్న ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సన్నాహాలు చేసింది అధిష్టానం.

కాగా శివ ప్రసాద్ రెడ్డి అందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వైసిపి జిల్లా వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కాగా తన తండ్రికి ఆపరేషన్ చేయించాల్సి ఉందని, దానికోసం మూడు నెలలు గడువు కావాలని ఆయన కోరారు. ఈ మూడు నెలలు దర్శి బాధ్యతలు జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించాలని సూచించారు. డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో దర్శి ఇంచార్జి బాధ్యతలు తీసుకుంటానని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.

సుమారు 15 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు బూచేపల్లి కుటుంబం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004 లో కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు భంగపాటు కలిగింది. ఇక ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు 2000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్సార్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2009 లో సుబ్బారెడ్డి తనయుడు శివప్రసాద్ రెడ్డి దర్శి నుండి ఎన్నికల బరిలోకి దిగి 12 వేల ఓట్ల ఆధిక్యంతో ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్థి శిద్దా రాఘవరావు చేతిలో 1200 ఓట్లు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా సుమారు పదిహేనేళ్ళు దర్శి నియోజకవర్గంతో పాటు, చీమకుర్తి ప్రాంతంలో బూచేపల్లి కుటుంబం రాజకీయంగా చక్రం తిప్పారు. అదే టైములో బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య చీమకుర్తి ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు.

అంతేకాకుండా బూచేపల్లి కుటుంబానికి వైఎస్ కుటుంబంతో ఎప్పటి నుండో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జగన్ వైసిపి ని స్థాపించాక బూచేపల్లి కుటుంబం కూడా ఆయన వెంటే నడిచింది. కాగా 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ పోటీ చేయను అని చెప్పడం పార్టీ శ్రేణులకు ఇబ్బందిగానే మారింది. అదే స్థాయిలో దర్శిలో పార్టీని బలోపేతం చేయగల నాయకుడిని ఎన్నుకోవడం కోసం తర్జన భర్జన పడింది. బాదం మాధవరెడ్డిని నియమించడం, ఆయన తీరు అసంతృప్తిగా ఉండటంతో తిరిగి బూచేపల్లి పోటీలోకి రావడం అభిమానుల్లో సంతోషం నెలకొంది. వైసిపి శ్రేణులు కూడా విజయం మనదే అని సంతోషం ధీమా వ్యక్తం చేస్తున్నాయి.