టిఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు.. టిఆర్ఎస్ లో కలకలం

టిఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి ఆయన ఓడిపోయారు. ఓడిపోయినా తానే ఎమ్మెల్యేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పని కావాలన్నా తనతోనే అవుతుందని, లేకపోతే అందరికి నట్లు బిగిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరాయన, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే…         

ఆయనే టిఆర్ఎస్ నేత, ఓయూ విద్యార్ది జేఏసీ నేత పిడమర్తి రవి. ఆయన ఏం మాట్లాడినా వివాదమే. అప్పట్లో సంక్రాంతి సెలవులకు వెళ్లిన ఆంధ్రా ప్రజలు ఇక తెలంగాణకు రావద్దని తేల్చి చెప్పారు. అప్పుడు ఈ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. అప్పటి నుంచి పిడమర్తి రవి ఏం మాట్లాడిన హాట్ టాపిక్ అవుతున్నాయి. పిడమర్తి రవి ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లోనూ పిడమర్తి రవి ఓటమిపాలయ్యారు. కూటమి నేత సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. అయితే నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“సత్తుపల్లిలో నేను ఓడిపోయినా నేనే ఎమ్మెల్యేను. ఇక నుంచి  ఏ పనులు కావాలన్నా నన్ను అడగాల్సిందే. నాకు తెలియకుండా ఎవరికి ఏ పనులు కావు. అందరికి నట్లు బిగిస్తాను. సండ్ర వెంకట వీరయ్య పేరుకే ఎమ్మెల్యే. అధికారమంతా నాదే. టిఆర్ఎస్ ఇంఛార్జీగా నాకు తెలియకుండా ఏ పనులు కావు. అందరికి ఇది హెచ్చరిక లాంటిది” అంటూ పిడమర్తి రవి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

ఖమ్మం జిల్లాలో మొదటి నుంచచి టిఆర్ఎస్ కు గట్టి పోటి ఎదురవుతూనే వస్తోంది.తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో తీర్పు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటే ఖమ్మం జిల్లాలో మాత్రం కూటమికి అనుకూల పవనాలు వీచాయి. ఖమ్మం జిల్లా ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చి ఔరా అనిపించారు. 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్దులు విజయం సాధించారు. ఖమ్మం టౌన్ లో మాత్రమే టిఆర్ఎస్ గెలవగలిగింది.

విద్యార్ధి నాయకుడిగా పేరు తెచ్చుకున్న పిడమర్తి రవిని సత్తుపల్లి నుంచి టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. అయితే మహాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో రవి ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో పాలేరు నుంచి సత్తుపల్లి వచ్చి టీడీపీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. 

సత్తుపల్లిలో పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే ఉన్నా కూడా తానే ఎమ్మెల్యే అంటూ మాట్లాడిన మాటలు పొలిటికల్ హీటెక్కించాయి. పిడమర్తి రవి గతంలోను పలు వివాదాలలో నిలిచారు. నోటి దురుసుతో పిడమర్తి అతిగా ప్రవర్తిస్తారని పేరుంది. ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ గా పిడమర్తి రవి పని చేశారు. దీని పై మరి టిఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. కూటమి నేతలైతే పిడమర్తి రవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.