బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ నలిగిపోతున్న ఫేస్‌బుక్‌ 

Congress party balaming Facebook 

భారతదేశంలో సోషల్ మీడియా ఎంత వేగంగా వృద్ది చెందిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్నెట్ సౌకర్యం పెరగడంతో  ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్స్టా గ్రమ్, టిక్ టాక్ లాంటి మాధ్యమాల వాడకం విపరీతంగా పెరిగింది.  దీంతో రాజకీయ పార్టీల చూపు ఆ మాధ్యమాల మీద పడింది.  ఎన్నికల ప్రచారానికి టీవీ, వార్తా పత్రికల కంటే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుకుంటున్నాయి పార్టీలు.  ఒక పార్టీ అని లేదు.. బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకున్నాయి, వాడుకుంటున్నాయి.  కానీ బీజేపీ మాత్రం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌ను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుందని, ఫేస్‌బుక్‌ సైతం పక్షపాతంగా వ్యవహరించి బీజేపీ కోసం పనిచేసిందని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 

Congress party balaming Facebook 

దీంతో ఇండియాలో దుమారం మొదలైంది.  భారత్ నందు ఫేస్‌బుక్‌ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిందని, వారి విధానాలను బీజేపీకి అనుగుణంగా మార్చుకుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు మొదలుపెట్టింది.  ఆరోపణలు వచ్చింది ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థ మీద కావడంతో కాంగ్రెస్ ఆరోపణలు బాగా ప్రభావం చూపాయి.  ఇతరుల పోస్టుల మీద గట్టి నిఘా పెట్టిన ఫేస్‌బుక్‌ బీజేపీ చేసిన విద్వేషపూరిత పోస్టుల మీద ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  ఇటీవల రిలయన్స్ నందు‌ ఫేస్‌బుక్‌ పెట్టుబడులు పెట్టడంపై సీపీఐ అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ శాఖలు లేదా సంస్థలతో కలిసి ఫేస్‌బుక్‌ పనిచేయకుండా ఆదేశాలివ్వాలని డిమాండ్‌ చేసింది.  

బీజేపీ నేతలు సైతం తమకు ఫేస్‌బుక్‌ సంస్థతో ఎలాంటి ప్రత్యేక అనుబంధాలు లేవని, కాంగ్రెస్ పార్టీ కూడా ఫేస్‌బుక్‌ సేవలను వాడుకోలేదా, నిబంధనల మేరకే అందరిలా తాము ఆ సంస్థ సేవలను వాడుకున్నామని వాదిస్తున్నారు.  ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో చెప్పలేం కానీ ఫేస్‌బుక్‌ సంస్థ దేశానికొక విధానాన్ని ఫాలో అవుతోందన్నది వాస్తవం.  పైగా అదొక కార్పొరేట్ సంస్థ.  వారు దేశాల చట్టాలు, నిబంధనలు, ప్రజాస్వామిక విలువలు లాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు.  వారికి అంతిమంగా కావాల్సింది లాభాలు.  ఆ దృష్టి కోణంలోనే వారి పని విధానం ఉంటుంది.  ఆ పనితీరు వలనే ఈరోజు ఫేస్‌బుక్‌ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ నలిగిపోతోంది.  ఇక అంతిమంగా ఈ ఆరోపణల మీద టిక్ టాక్ యాప్ మీద తీసుకున్న తరహా చర్యలు ఉంటాయా అంటే ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేం.