ఇదీ హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ చరిత్ర

తెలుగు నేల మీద చాలా మంది ఆవేశంతో రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ ఆ పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. హేమాహేమీలు అనుకున్న వారు కూడా పార్టీ పెట్టి బొక్క బోర్లా పడ్డారు. అలాంటి వారిలో ప్రముఖ మెగా స్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ  ఒక్క ఎన్నికల్లోనే పోటీ చేసి కనుమరుగైంది. ఓట్లు సీటు బాగానే వచ్చినా పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. అదే సమయంలో నవ తెలంగాణ ప్రజా పార్టీ అనేదాన్ని టిడిపిలో సీనియర్ నేతగా ఉన్న దేవేందర్ గౌడ్ స్థాపించారు. అది అతి కొద్ది కాలంలోనే కనుమరుగైంది.

మత ప్రార్థనలు చేసే వ్యక్తి కె.ఎ.పాల్ కూడా ప్రజాశాంతి పార్టీ అనేదాన్ని స్థాపించారు. కానీ అది మనుగడలో లేదు. తొలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎంపి సీట్లు భారీగా గెలుచుకున్నారు. కానీ అనతికాలంలో ఆ పార్టీ కూడా నిలదొక్కుకోలేక దుకాణం మూసేసింది. సినీ నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలబెట్టలేదు.

ఎన్టీఆర్ రెండో సతీమణి నందమూరి లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ టిడిపి ని ఆరంభించారు. ఆమె ఒకసారి ఆ పార్టీ తరుపున గెలిచారు. తర్వాత కాలంలో ఆ పార్టీని బతికించలేకపోయారు. ప్రముఖులైన వారు పెట్టిన పార్టీలు కూడా మనుగడ సాధించలేదు. అలాంటిదే ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. సీతయ్య పెట్టిన పార్టీ వివరాలు కింద చదవండి.

బుధవారం నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ గతంలో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీలో పనిచేయడం వేరు, పార్టీని నడపడం వేరు అని ఆయనకు అతి తొందరలోనే అర్థమైంది. దీంతో కేవలం ఒకే ఎన్నిక తరువాత ఆ పార్టీ కనుమరుగైపోయింది. ఆ ఎన్నికల్లో అన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఎం రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా అన్న టిడిపి మాత్రం ఒక్క సీటు కూడా గెవలేకపోయింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి హరికృష్ణ కూడా ఓటమి పాయ్యారు.

ఎన్‌టీ రామారావు మరణం తరువాత  1995లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంతివ్రర్గంలో నందమూరి హరికృష్ణ మంత్రిగా పనిచేశారు. ఆరు నెలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత ఆయన టీడీపీలో కొనసాగినా చంద్రబాబుతో రాజకీయంగా కొంత విభేదించారు. 1999 ఎన్నిక నాటికి బావ బామ్మార్దుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో హరికృష్ణ టీడీపీ నుంచి బైటకు వచ్చి హైదరాబాద్‌ ఆబిడ్స్ లోని ఆహ్వానం హోటల్‌ వేదికగా అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

1999 జనవరి 26న ఆయన అన్న తెలుగుదేశం పార్టీని స్ధాపించారు. అన్న తెలుగుదేశం  పార్టీ కార్యాయాన్ని అప్పటికి రాజకీయాల్లోకి రాని ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలుగా ఉన్న హరికృష్ణ సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఆ పార్టీలో క్రియాశీక పాత్ర పోషించారు. అన్న తెలుగుదేశం ప్రారంభించిన వెంటనే హరికృష్ణ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించారు కూడా.

1999 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్న తెలుగుదేశం 191 స్థానాల్లో పోటీచేసింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఎం 48 స్థానాల్లో , సీపీఐ 55 స్థానాల్లో పోటీచేశాయి.  సీపీఎం తరపున భద్రాచం, నకిరేకల్‌ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన సున్నం రాజయ్య, నోము నరసింహయ్య ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. సీపీఐ, అన్న తెలుగుదేశం తరపున  ఎవ్వరూ విజయం సాధించలేకపోయారు. 191 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన అన్న తెలుగుదేశం 3,71,718 ఓట్లు అంటే పోలైన వాటిల్లో 1.12 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేసిన పార్టీ 2,44,045 ఓట్లు సాధించింది. పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.

దీంతో ఆ పార్టీని ముందుకు నడపలేక హరికృష్ణ మూసేశారు. తర్వాత మళ్లీ టిడిపిలో చేరిపోయారు. తర్వాత కాలంలో టిడిపిలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయనను నియమించినా పార్టీలో మాత్రం పట్టు సాధించలేకపోయారు. పార్టీ అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది. తర్వాత కాలంలో హరికృష్ణను రాజ్యసభకు నామినేట్ చేశారు. తర్వాత జై సమక్యాంధ్ర ఉద్యమ కాలంలో సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.