కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త పోయించిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించడంతో నష్టనివారణ చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు చెత్త వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీనికి నిరసనగా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కమిషనర్ ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు. ఈ వ్యవహారం ఢిల్లీ స్థాయికి చేరడంతో ఆయనపై జగన్ సర్కారు వేటు వేసింది.బ్యాంక్ ఎదుట చెత్త వేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను మున్సిపల్‌శాఖ కమిషనర్ వివరణ కోరింది.అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి బ్యాంకు అధికారుల సంఘానికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ లేఖ రాశారు.
బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే నిమిషాల్లోనే చెత్తను తీసివేయించామని తెలిపారు. చెత్త వేసిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కలిసి పనిచేద్దామని లేఖలో కలెక్టర్ కోరారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇంకా ఎక్కువ కాక ముందే జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.