పంచాయతీ కార్యదర్శి పరీక్ష మళ్లీ వాయిదా

తెలంగాణ ఉద్యోగ నియామక పరీక్షల్లో అడుగడుగునా చిక్కులు వచ్చి పడుతున్నాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి అక్టోబర్ 4 వతేదిన పరీక్ష తేదిని ప్రకటించారు. నోటిఫికేషన్ కు, పరీక్ష నిర్వహణకు మినిమం గడువు ఉండాలని ఇంత తక్కువ సమయంలో ప్రిపేర్ కాలేమని పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.  పంచాయతీ కార్యదర్శి పరీక్షను అక్టోబర్ 4 వతేదిన కాకుండా అక్టోబర్ 10వ తేదికి వాయిదా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఫీజు చెల్లింపును ఈ నెల 14 వ తేది వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు 15 వ తేది వరకు గడువు పొడిగించారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం 5.69 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదిన పరీక్ష నిర్వహిస్తున్నట్టు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ వారం క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 

పంచాయతీ కార్యదర్శి పరీక్షను అక్టోబర్ 10 బుధవారం నిర్వహించటం పై నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు పరీక్షను ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి కనీస ప్రణాళిక లేకుండానే పరీక్షల షెడ్యూల్ ప్రకటించి ఇష్టమొచ్చినట్టు మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు మండి పడుతున్నారు.

బుధవారం పరీక్ష నిర్వహిస్తే ట్రాఫిక్ చిక్కులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాలను కూడా అభ్యర్ధులు పెట్టుకున్న ప్రాంతాలలో ప్రిపర్ ఇచ్చి సెంటర్లు కేటాయించాలని వారు కోరారు. వీఆర్వో ఎగ్జామ్ లాగా సుదూర ప్రాంతాల్లో వేసి అభ్యర్ధులను ఇబ్బంది పెట్టవద్దని వారు కోరారు. పరీక్షకు అవసరమైతే మరికొంత సమయం పెంచాలని, ఇలా ఇష్టం వచ్చినట్టు తేదిలు ప్రకటించి నిరుద్యోగులతో చెలగాటమాడవద్దని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.