ఈ రోజు ప్రారంభమయిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మొత్తానికి టిడిపిది పైచేయి అయింది. రాష్ట్రానికి మిత్ర ద్రోహం చేసిన ప్రధాని మంత్రి మోదీని వదిలేది లేదని ప్రతిజ్ఞ చేసిన తెలుగుదేశం పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో విజయవంతమయింది. కాంగ్రెస్ పార్టీతో సహా , మరికొన్ని పార్టీలు కూడా అవిశాస్వా తీర్మానం నోటీసులు ఇచ్చినా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం తెలుగు దేశం పార్టీ ఇచ్చిన నోటీసునే చదివి వినిపించి సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఇదొక విధంగా తెలుగుదేశం పార్టీకి విజయమే. ఎందుకంటే, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నోటీసును కేంద్రం పట్టించుకోలేదు. ఇది కాంగ్రెస్ కు నచ్చ లేదు. కేవలం టిడిపి నోటీసును మాత్రమే స్పీకర్ చదవడం పట్ల ప్రతిపక్ష నాయకుడు మల్లి ఖార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.
టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు స్పీకర్ సుమిత్ర మహాజన్ అనుమతిచ్చారు. దీనిపై ఏ రోజున చర్చించాలనే దానిపై పది రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని స్పీకర్ సభకు తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి 50 మందికి పైగా సభ్యుల మద్దతు ఉందని దీనిపై చర్చించాలని టిడిపి ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ముందుంచారు. అదే విధంగా మిగిలిన పార్టీల నుంచి వచ్చిన అవిశ్వాస తీర్మానాలు కూడా అందాయని అందులో మొదట ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పీకర్ తెలిపారు. అందుకే టిడిపి ఇచ్చిన అవిశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుంటున్నానని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారు. అన్ని వాయిదా తీర్మానాలను చదివి వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నానని, దీనిలో ఎటువంటి మార్పు లేదని అవిశ్వాస తీర్మానంపై చర్చ తేదిని పది రోజుల్లో ప్రకటిస్తానని స్పీకర్ తెలిపారు.
పార్లమెంటులో మొత్తం సీట్లు 543 ఉండగా అందులో ఎన్డీఏ కూటమికి 314 మంది సభ్యులు ఉన్నారు. యూపిఏ కూటమికి 66 మంది సభ్యులు ఉన్నారు. ఇతర పార్టీల వారు 163 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 272 మంది సభ్యులు. దీంతో బిజెపి అవిశ్వాసం నెగ్గుతామనే ఉద్దేశ్యంతోనే చర్చకు అనుమతించినట్టు తెలుస్తుంది. అలాగే టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోవడంతో ఇది టిడిపికి కలిసొచ్చే అవకాశంగా చెప్పవచ్చు.
టిడిపి గత సమావేశాల నుంచి కూడా పార్లమెంటులో తీవ్రంగా పోరాడుతుంది. ఏపికి ఇచ్చిన హమీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. గత సమావేశాల్లో పెట్టిన అవిశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో టిడిపి నేతలు ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టి అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. టిడిపి తీసుకున్న నిర్ణయం టిడిపి కి లాభించే అవకాశంగా ఉంది. ఎందుకంటే ఏపీ లో నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలతో సతమతమవుతున్న టిడిపికి అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోవడం కలిసొచ్చే అంశం. నిజంగానే అవిశ్వాసాన్ని నెగ్గితే టిడిపి విజయంగా చెప్పవచ్చు. కానీ బిజెపికి ఉన్న బలం ముందు అది ఫలిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.