వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను వైసీపీ ఎంపీలు ఇప్పటికే పలుమార్లు కలసి ఫిర్యాదులు చేసినప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ లు స్పీకర్ ను మరోసారి కలిసి… రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరటం జరిగింది.
ఈ వ్యవహారంలో స్పీకర్ నుండి ఎటువంటి స్పందనా రాకపోవటంతో వైసీపీ నాయకులు అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విజయసాయి స్పీకర్ ఓం బిర్లా, రఘురామపై ఘాటు వ్యాఖ్యలు చేయటం జరిగింది. ” రఘురామపై అనర్హత పిటీషన్ వేసి ఏడాది దాటిందని… ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ గనుక రఘురామపై చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్ లో ఆందోళన చేపడుతామని… పార్లమెంట్ ను స్తంభింప చేస్తామని” విజయసాయి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలనే పావులుగా వాడుతూ విజయసాయి రెడ్డిని ఇరకాటంలో పెట్టే పనిలో రఘురామ నిమగ్నమైయ్యారు.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ రఘురామ పార్లమెంట్ సభా హక్కుల కమిటీ చైర్మన్ కు లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి అనడం అనైతికమని… సభా కార్యక్రమాలను అడ్డుకుంటామనడం బెదిరింపులకు కిందకే వస్తుందన్నారు. స్పీకర్ ను విజయసాయిరెడ్డి బెదిరించే ప్రయత్నం చేశారని రఘురామ ఆరోపించారు. విజయసాయి రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో కోరారు. దీనిపై పార్లమెంట్ సభా హక్కుల కమిటీ చైర్మన్ నుండి రిప్లై రావాల్సి ఉంది. ఇక, చిన్న విషయాలకే ఆఘమేఘాల మీద కౌంటర్ ఇచ్చే విసారె గారు ఈ వ్యవహారంలో ఇంతవరకు స్పందించకపోవటం వింతగానే ఉంది.