జగన్ పై హత్యాయత్నం కేసులో తవ్వుతున్నకొద్దీ బయటకొస్తున్న వాస్తవాలు

YS Jagan Mohan Reddy

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనేక కోణాల్లో విచారణ జరుపుతోంది. విచారణలో తవ్వుతున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. అధికారులు ప్రతి చిన్న క్లూని వదలడం లేదు. ఈ మేరకు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కుటుంబ ఆర్ధిక పరిస్థితులపై దృష్టి పెట్టింది సిట్. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో మూడోరోజు ఆదివారం కూడా శ్రీనివాస్ సోదరుడు జనిపల్లి సుబ్బరాజును విచారించారు అధికారులు.

ఇటీవల సోదరుడి బిడ్డ పుట్టిన రోజు వేడుకను కూడా ఘనంగా నిర్వహించాడు శ్రీనివాస్. ఆ సందర్భంగా కొంతమందికి విందు ఇచ్చి పార్టీ చేసుకున్నట్టు విచారణలో తేలింది. పార్టీ చేసుకున్న సందర్భంలో వారితో “భూమి కొంటాను చూడండి, మంచి పార్టీ దొరికింది” అని శ్రీనివాస్ చెప్పినట్టు వెల్లడైంది. ఈ చర్చపైన కూడా అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు.

అధికారుల దర్యాప్తులో అయినవిల్లి మండలం కొండుకొందురుకు చెందిన ఒక యువకుడితో శ్రీనివాస్ కు మంచి మిత్రుత్వం ఉన్నట్టు తెలిసింది. అతడిని కూడా విచారించే దిశగా అధికారులు ఉన్నారు. కాగా విచారణలో శ్రీనివాస్ తన బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాడు. ఈ డీటెయిల్స్ ఆధారంగా సోమవారం ఆ బ్యాంకులకు వెళ్లి తన అకౌంట్స్ లావాదేవీల వ్యవహారాలు పరిశీలించిందేకు రెడీ అయ్యారు అధికారులు.

ఇప్పటికే అధికారులు ముమ్మిడివరంలోని ఒక బ్యాంకులో శ్రీనివాసరావు ఖాతా వివరాలు సేకరించారు. అమలాపురంలో కూడా ఒక బ్యాంకులో శ్రీనివాసరావుకు అకౌంట్ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఆ ఆకౌంట్ లావాదేవీలపైన కూడా అధికారులు దృష్టి పెట్టారు. శ్రీనివాస్ అన్న సుబ్బరాజు, శ్రీనివాస్ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల డీటెయిల్స్ కూడా పరిశీలించనున్నారు. శ్రీనివాస్ కాల్ డేటాను పరిశీలించిన అధికారులు కొన్ని వేల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. అయితే అతను ఈ కాల్స్ ఎవరికీ చేసాడు? ఏ విషయం గురించి చర్చలు జరిపాడు అనే అంశాలపైనా దర్యాప్తు చేస్తున్నారు. 

ఇటీవలే సొంత ఊరిలో ఉన్న 9 సెంట్ల భూమిని శ్రీనివాస్ కుటుంబం ఒక ప్రయివేటు బ్యాంకులో రిజిస్టర్ ఒప్పందం చేయించుకుని నాలుగు లక్షల లోన్ తీసుకుంది. దీనికి 11,770 రూ. ఈఎంఐ చెల్లిస్తోంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరొక షాకింగ్ అంశం ఏమిటంటే దాడి సమయంలో శ్రీనివాస్ వద్ద లభ్యమైన 10 పేజీల లేఖలానే ఠాణేలంకలోని అతని ఇంట్లో ఉన్న మరో 20 పేజీల లెటర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీనివాసరావు పేరుతో 2 లక్షల రూపాయల జీవిత భీమా ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. దీనికి ప్రతి ఆరు నెలలకొకసారి 5,500 రూపాయల వాయిదా కట్టాలి. శ్రీనివాస్ ఈ మొత్తాన్ని ఎలా కడుతున్నాడు అనే అంశంపైనా అధికారులు ఆరా తీస్తన్నారు. కాగా విచారణ కోసం శ్రీనివాసరావు బాబాయ్ కూతురు విజయదుర్గను, స్నేహితుడు చైతన్యను విశాఖ తీసుకెళ్లారు అధికారులు. వారు ఆదివారం ఠాణేలంకకు చేరుకున్నారు.