పెళ్లైన గంటల్లోనే రోడ్డు ప్రమాదం, అమ్మాయి పరిస్థితి సీరియస్

ఆనందంగా వారి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడిపారు. చేతిలో పారాణి ఇంక ఆరనే లేదు. తమ కొత్త జీవితం పై ఎన్నో ఆశలతో వారు దేవుని దర్శనానికి బయలు దేరారు. అంతలోనే విధి వారిని వక్రీకరించింది. దైవ దర్శనానికి వెళ్తూ వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అసలు వివరాలు ఏంటంటే…

భీమిలి తోటవీధికి చెందిన హారికకు విజయనగరం రింగ్‌రోడ్‌ సమీపంలోని అశోక్‌నగర్‌కు చెందిన కారి ఎర్రయ్యతో ఆదివారం తెల్లవారు జామున అశోక్‌నగర్‌లో ఉన్న షాదీఖానాలో వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే సింహాచలంలో అప్పన్నస్వామిని దర్శించుకుని రండని నూతన వధూవరులను వారి తల్లిదండ్రులు పంపించారు.

సింహాచలంలో స్వామివారి దర్శనం అయిన వెంటనే భీమిలి తోటవీధికి కారులో బయలుదేరారు. పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వస్తున్న బస్సు లొడగలవానిపాలెం వద్దకు చేరుకునే సరికి మరమ్మతులకు గురైంది. దీంతో సిబ్బంది బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. సింహాచలం నుంచి వస్తున్న కొత్త దంపతుల కారు లొడగలవానిపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ఎర్రయ్య, హారికలు, వారితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సోమరాజు, సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు.  ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

పెళ్లైన గంటల్లోనే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. విషయం తెలియగానే వారు కేజీహెచ్  ఆస్పత్రికి వచ్చారు. పసుపు కుంకుమతో ఉన్నవారు రక్తపు మడుగులో ఉండటంతో చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు.  ఆనందంగా ఉండాల్సిన వారు తీవ్ర గాయాలతో అచేతనంగా ఉండటంతో వారు షాక్ తిన్నారు. ఆస్పత్రిలో వారి రోదనలు మిన్నంటాయి. ఇరు కుటుంబాల్లో ఈ సంఘటనతో విషాదం ఏర్పడింది. దంపతుల పరిస్థితి విషమంగానే ఉందని, రెండు రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు తెలిపారు.