ఛత్తీస్‌గఢ్‌లో భయానక రైలు ప్రమాదం.. ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు ఢీ.. ఆరుగురు దుర్మరణం..!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలో భయంకరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ నుండి బిలాస్‌పూర్ వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్, ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం లాల్‌ఖడాన్ సమీపంలో చోటుచేసుకోగా, ఢీకొనడం అంత భీకరంగా జరిగిందంటే రెండు రైళ్ల బోగీలు ధ్వంసమైపోయాయి. ప్రాదమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. కాసేపటికి రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటన జరిగిందని తెలుసుకున్న వెంటనే ఛత్తీస్‌గఢ్ రైల్వే డివిజన్ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హౌరా రూట్ మార్గంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల రైలు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ప్రమాద స్థలంలో రాత్రంతా ట్రాక్ క్లియర్ చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు కొనసాగించారు.

ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా సిగ్నల్ లోపం లేదా మానవ తప్పిదం కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం తేలడానికి రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి రైలు ప్రమాదాలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండు నెలల్లోనే ఈ డివిజన్‌లో మూడు రైలు పట్టాలు తప్పిన ఘటనలు నమోదయ్యాయి. భద్రతా చర్యల్లో లోపాలే ఈ ప్రమాదాలకు కారణమా అనే ప్రశ్న ఇప్పుడు రైల్వే వ్యవస్థను వేధిస్తోంది.