జీతాలివ్వటానికే నిధులు లేవు… రాజధానిని ఎలా నిర్మిస్తారు ?

Raghurama krishnam raju questioning ycp government

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు. దాదాపు 18 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించామని రఘురామ మీడియాకు తెలిపారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని కొనసాగించాల్సిందేనని స్పష్టంచేశారు.అమరావతిలో అగ్రవర్ణాలు కాదు వెనకబడిన తరగతుల వారే ఎక్కువగా ఉన్నారని రఘురామ చెప్పారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోడీయేనని.. అందుకే ఆయనకు అన్నీ విషయాలు తెలియజేశానని చెప్పారు.

Raghurama krishnam raju questioning ycp government
Raghurama krishnam raju questioning ycp government

అమరావతిలో ఇప్పటికే రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని తెలియజేశారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చేందుకే నిధులు లేని పరిస్ధితి అని చెప్పారు. అలాంటి పరిస్థితిలో విశాఖపట్టణంలో రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం ఆషామాషీ అనే విషయం తెలియదా అని అడిగారు. ఆలయాలపై దాడుల గురించి కూడా డిస్కషన్ చేశానని రఘురామ తెలిపారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని చెప్పారు. ఆలయాలపై జరుగుతోన్న దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా తమ మధ్య చర్చకు వచ్చిందని రఘురామ చెప్పారు.

స్టీల్‌ప్లాంట్‌ పై మోదీ అభయం లభించినట్టుగానే భావిస్తున్నానని రఘురామ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే విశాఖ పట్టణానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఆ సిటీకి సంబంధించి అభివృద్ధి పనులు కొనసాగుతాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చే సరికి ప్రధాని మోడీని సీఎం జగన్, ఎంపీలు కలువాలని కోరారు. సీఎం కాదని అంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు అని చెప్పారు. జగన్ ప్రధానిని కోరినా.. ప్రైవేటీకరణ జరిగితే అందుకు బాధ్యులు సీఎం అవుతారని చెప్పారు. మరొకరిపై నెపం వేసే అవకాశం లేదని చెప్పారు. తాను చెప్పిన అన్నీ అంశాలను మోడీ సానుకూలంగా స్పందించారని రఘురామ తెలియజేశారు.