చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నాలు కావ‌లెను !

(కోపల్లె ఫణికుమార్)

అవును మీరు చ‌దివింది నిజ‌మే. అందులో ఆశ్చ‌ర్య‌పోవ‌టానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్ళ‌ల్లో చంద్ర‌బాబునాయుడు నిర్వ‌హించిన అనేక స‌భ‌ల‌కు బొత్తిగా జ‌నాలుండ‌టం లేదు. తాజాగా శ్రీ‌శైలంలో నిర్వ‌హించిన జ‌ల‌హార‌తి స‌భ కూడా జ‌నాలు లేక బోసిపోయింది. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత నాలుగున్న‌రేళ్ళ‌ల్లో చంద్ర‌బాబు న‌వ‌నిర్మాణ దీక్ష‌లు, ఎన్డీఏలో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌ర్వాత ధ‌ర్మ‌పోరాట స‌భ‌లు, విద్యార్ధుల కోసం జ్ఞాన నేత్రాలని ఇలా…ర‌కాల ర‌కాల పేర్ల‌తో ఎన్నో స‌భ‌లు నిర్వ‌హించారు. ఎక్క‌డ చూసినా ఒక‌టే కామ‌న్ పాయింట్. వేదిక‌మీద నుండి చంద్ర‌బాబు మాట్లాడుతుంటారు కానీ వేదిక ముందు మాత్రం పెద్ద‌గా జ‌నాలుండ‌టం లేదు.

ముఖ్య‌మంత్రి స్ధాయిలో చంద్ర‌బాబు స‌భ‌లు నిర్వ‌హిస్తుంటే జ‌నాలు రాక‌పోవ‌టం నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంది. పార్టీ వ‌ర్గాల‌తో మాట్లాడితే అందుకు కొన్ని కార‌ణాలు క‌నిపిస్తున్నాయ్. అవేమిటంటే, పోయిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా వాటిని తుంగ‌లో తొక్క‌ట‌మే. నాలుగేళ్ళ పాటు ఎన్డీఏతో అంట‌కాగి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్ట‌టం. ఎన్డీఏలో మిత్ర‌ప‌క్షంగా ఉండి కూడా విభ‌జ‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌టంలో విఫ‌ల‌మ‌వ్వ‌టం, ప్ర‌త్యేక‌హోదా కోసం తాను పోరాడక పోగా పోరాడిన జ‌గ‌న్ త‌దిత‌రుల‌పై కేసులు పెట్ట‌టం.

కేంద్రం నుండి ఆశించిన వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌వ‌ని అర్ధం కాగానే ఎన్డీఏలో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసి వెంట‌నే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ అడ్డుకుంటున్నాడ‌నే ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్ట‌టం. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా న‌వ‌నిర్మాణ దీక్ష‌ల పేరుతో కోట్లాది రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని వృధా చేయ‌టం. ఎన్డీఏతో విభేదించిన త‌ర్వాత కేంద్రానికి వ్య‌తిరేకంగా ధ‌ర్మ‌పోరాట స‌భ‌ల పేరుతో మ‌ళ్ళీ కోట్ల రూపాయ‌లు వృధా చేయ‌టాన్ని జ‌నాలు ఒప్పుకోలేదు.

ఇక‌, అన్నిటిక‌న్నా మించిన కార‌ణ‌మేమిటంటే చెప్పిన విష‌యాన్నే ప‌దే ప‌దే చెప్ప‌టం త‌ప్ప కొత్త అంశాల‌ను ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం. ఎన్నిసార్ల‌ని జ‌గ‌న్ ను తిడుతుంటే, మోడిపై ఆరోప‌ణ‌లు చేస్తుంటే జ‌నాలు వింటారు ? త‌న ఫెయిల్యూర్ల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే ప్ర‌త్య‌ర్ధుల‌పై బుర‌ద‌చ‌ల్లుతున్నార‌న్న విష‌యం జ‌నాల‌కు బాగా అర్ధ‌మైపోయింది. అందుక‌నే డ‌బ్బులిస్తామ‌ని బ్ర‌తిమ‌లాడినా, బెదిరించినా కూడా జ‌నాలు చంద్ర‌బాబు స‌భ‌ల‌కు హాజ‌రుకావ‌టానికి భ‌య‌ప‌డి త‌ప్పించుకుంటున్నారు.