జగన్ పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ శ్రేణుల్లో ఇంకా ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు అధికార ప్రభుత్వం పై మండి పడుతున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే జగన్ పై దాడి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
పాదయాత్ర మొదలైనప్పటి నుండి జగన్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవుతాడని టీడీపీ కి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ పై దాడి ఘటనపై స్పందించారు.
పుంగనూరు మండలం కమతంపల్లెలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీడీపీకి అడ్డు ఉండరాదనే కుట్రతోనే విశాఖ ఎయిర్పోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ కు సీఎం వలె నటించడం రాదని అన్నారు. అలా నటించడం తెలిసి ఉంటే ఎయిర్పోర్టులోనే కిందపడి హడావిడి చేసి ఉండేవారని ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మరేదైనా కుట్ర జరుగుతుందేమో అనే అనుమానంతోనే హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారని తెలియజేసారు. ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావుపై కూడా ఆయన విమర్శలు చేశారు. డీజీపీ ఖాకీ బట్టలు వదిలి పసుపు చొక్కా వేసుకుంటే మంచిదని సూచించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు పక్షపాత ధోరణి మాని నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
