పవన్ వర్సెస్ మోహన్‌బాబు.. ‘ఉత్కంఠ’ వీడేదెప్పుడు.?

11వ తేదీ లేదా 12వ తేదీన సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు.. మరో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌కి ‘సమాధానం’ ఇవ్వనున్న విషయం విదితమే. ఆ సమాధానం ఎలా వుండబోతోంది.? ఈ విషయమై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మాట్లాడుతూ, ‘గట్టిగానే ప్రిపేరవుతున్నారు.. నాన్నగారు సమాధానం ఖచ్చితంగా ఇస్తారు..’ అని అసలు విషయం చెప్పకనే చెప్పేశాడు.

‘తమ్ముడూ మోహన్ బాబూ..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ సినీ వేడుక సాక్షిగా పవన్ కళ్యాణ్, సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి – మోహన్ బాబు మధ్య ‘లెజెండ్ – సెలబ్రిటీ’ అన్న అంశంపై రచ్చ జరిగింది. చిరంజీవి – మోహన్ బాబు మధ్య గిల్లికజ్జాల విషయంలో ఎవరు తలదూర్చినా వెర్రోళ్ళమైపోతామంటూ మంచు విష్ణు తాజాగా వ్యాఖ్యానించినా, వారిద్దరిదీ గొప్ప స్నేహమని.. విష్ణు చెప్పుకొచ్చినా.. చిరంజీవి – మోహన్ బాబు మధ్య కొంత ‘గ్యాప్’ అయితే వుంది. అది పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు.

అన్నయ్య చిరంజీవి విషయంలో ఎవరు ‘అతి’గా వ్యవహరించినా పవన్ ఊరుకోరు.. మాట మీద అదుపు తప్పుతారు. ఆ కోణంలోనే పవన్, మోహన్ బాబు మీద గతంలో సెటైర్లు వేశారు. తాజా వివాదం వేరు. సినీ పరిశ్రమ సమస్యల్ని ప్రస్తావిస్తూ, మోహన్ బాబు కూడా స్పందించాలన్నారు. నిజానికి, మోహన్ బాబు ఒక్కరి పేరు మాత్రమే పవన్ ప్రస్తావించలేదు.. అందరి గురించీ మాట్లాడారు.

కానీ, మోహన్ బాబు, తన పేరుని పవన్ ప్రస్తావించడం పట్ల గుర్రుగా వున్నారు. ఘాటైన సమాధానం పవన్ కళ్యాణ్‌కి ఇవ్వాలనుకుంటున్నారు. పవన్ ప్రశ్నలకు సంబంధించి తగిన సమాచారాన్ని ఇప్పటికే మోహన్ బాబు సేకరించారట. కానీ, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల నేపథ్యంలో, ఆ ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తున్న దరిమిలా.. కాస్త వెనక్కి తగ్గారు మోహన్ బాబు.

తన కుమారుడికి ఓటెయ్యాలంటూ పవన్ కళ్యాణ్‌ని కోరిన మోహన్ బాబు, త్వరలో సమాధానమిస్తానని చెప్పడం వెనుక వ్యూహం సుస్పష్టం. కాగా, మోహన్ బాబు ఇచ్చే సమాధానానికి అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేసేందుకూ పవన్ కళ్యాణ్ సిద్ధంగా వున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం.