రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వెర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అనే యుద్ధంలో చివరికి ఈసీదే పైచేయి అయింది. హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో జగన్ సర్కార్ ఆటలకు దారులన్నీ మూసుకుపోయాయి. ఏకంగా అత్యున్నత న్యాయస్థానం నుండే అనుకూల తీర్పు రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిస్థాయి అధికారాలను ప్రదర్శిస్తున్నారు. గతంలో ఎవరెవరైతే తన నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రభుత్వానికి వత్తాసు పలికారో వారందరినీ టార్గెట్ చేశారు ఆయన. రాష్ట్ర పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్‌లను బదిలీ చేసేశారు.
అంతేకాదు వారి సర్వీస్ రికార్డుల్లో నమోదయ్యేలా అభిశంసన ఉత్తర్వులు కూడ ఇచ్చారు. బాధ్యతలు నిర్వర్తించండంలో విఫలమయ్యారని కారణం చూపారు. ఈ అభిశంసనతో వారిద్దరికీ ఏడాది పాటు ఎలాంటి పదోన్నతలు లభించవు. అంతేకాదు చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌లను కూడ బదిలీ చేశారు. వీరీ స్థానాల్లో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు పూర్తిస్థాయి కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక తిరుపతి అర్బన్ ఎస్పీని కూడ బదిలీ చేసేశారు. వీరందరి స్థానాల్లో త్వరలో కొత్తవారు బాధ్యతలు చేపడతారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కొత్త కలెక్టర్లుగా నియమించాలని ప్రభుత్వం సూచించిన పేర్లను కూడనిమ్మగడ్డ తిరస్కరించడం పెద్ద చురక.
అంతేకాదు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకానికి కూడ నిమ్మగడ్డ బ్రేకులు వేసేలా కనిపిస్తున్నారు. సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణను పొందవచ్చని భావించింది. పంచాయతీ ఎన్నికలు అనివార్యమని ముందుగానే ఊహించి రేషన్ పంపిణీకి వేల సంఖ్యలో వాహనాలను రెడీ చేసుకున్నారు. ఇప్పుడేమో నిమ్మగడ్డ అసలు ఈ పథకం కొత్తదా లేకపోతే పాతదా అనే వివరణ ఇవ్వాలని సూచించారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలోకి దించకూడదనే వాదన కూడ నడుస్తోంది. చూడబోతే ఎన్నికలు మొదలయ్యే లోపు నిమ్మగడ్డ జగన్ ప్రభుత్వానికి ఇంకొన్ని షాకులు ఇవ్వనున్నారని అనిపిస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం నిమ్మగడ్డ ఏం చేసినా సహకరించడం మినహా చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది.