తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లో భర్తీ చేయాలని సూచించారు. 200 మంది జనాభా ఉన్న గ్రామానికి కూడా ఒక కార్యదర్శి ఉండాలని, పంచాయతీ కార్యదర్శులే గ్రామాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని సీఎం అన్నారు.
ఉద్యోగాల నియామకానికి సంబంధించి సీఎం సమీక్ష నిర్వహిస్తే టిఎస్‌పీఎస్సీకి అప్పగించాం వారే భర్తీ చేస్తారని చెప్పేది కానీ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి మాత్రం జిల్లా క్యాడర్ లో భర్తీ చేయాలని చెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ కు టిఎస్‌పీఎస్సీ మీద నమ్మకం లేకనే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా చేయాలని నిర్ణయించారా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టిఎస్‌పీఎస్సీ ద్వారా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా.. అవి ఏదో కారణాలతో కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి. పరీక్షలు నిర్వహించినా అవి ఫలితాలు రాక వాయిదా పడ్డాయి. దీంతో నిరుద్యోగుల నుంచి, అభ్యర్దుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. టిఎస్‌పీఎస్సీ అంటేనే తప్పుల తడక అనే ముద్ర పడిపోయింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల నియామకం కూడా టిఎస్‌పీఎస్సీకి అప్పగిస్తే మళ్లీ అవే ఆటంకాలు ఎదురవుతాయని సీఎం భయపడ్డారేమోనని నిరుద్యోగులు అంటున్నారు.గురుకుల విద్యాలయాల్లో టిచర్ల భర్తీ పోస్టులను కూడా గురుకుల విద్యాలయాలకు అప్పగించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులను కూడా డిఎస్సీ ద్వారా నియమిస్తున్నారు.
వాస్తవానికి పంచాయతీ కార్యదర్శులకు డిగ్రీ అర్హతతో పరీక్ష నిర్వహించి ఎంపికి ప్రకియ చేస్తారు. గతంలో ఏపిపిఎస్సీ ఈ ప్రక్రియ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా పంచాయతీ కార్యదర్శుల నియమాకం జరుగుతుంది. టిఎస్ పీఎస్సీతో నిర్వహించాల్సిన పరీక్షలను డీఎస్సీ లెవల్ లో నిర్వహిస్తుండటంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, నూతన నిబంధనలు తయారు చేయడంపై కూడా నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల ప్రొబేషనరి తర్వాత నచ్చలేదనే సాకుతో తీసేస్తే రోడ్డున పడాలా, ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ఈ నిబంధన ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలలోనే ఉద్యోగ భద్రత కల్పిస్తున్న కాలంలో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మరోసారి ఆలోచించి టిఎస్‌పీఎస్సీ ద్వారనే ముందుకు వెళ్లాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
కొత్తగా నియమితులయ్యే కార్యదర్శులకు మూడేండ్ల ప్రొబేషనరి పీరియడ్ ఉంటుందని ఆ తర్వాత వారిని క్రమబద్దికరించాలని సీఎం అన్నారు. వారి పనితీరు సరిగా లేకుంటే వారిని క్రమబద్దికరించకుండా ఉండేలా నిబంధనలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రొబేషనరి సమయంలో వీరికి నెలకు 15 వేల రూపాయల జీతం ఇవ్వాలని నిర్ణయించారు. నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, జిల్లా క్యాడర్ లో నియమకాలను జరపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలుండగా అందులో ప్రస్తుతం 3562 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇటీవలే నూతన గ్రామపంచాయతీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఏ గ్రామంలో కూడా పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండకూడదని సీఎం అన్నారు. నియామక ప్రక్రియ, పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలను రూపొందిచాల్సిందిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర అధికారులను ఆయన ఆదేశించారు.