టిఆర్టీ అభ్యర్థుల అర్థ నగ్న ప్రదర్శన, టిఎస్పిఎస్సీ వద్ద టెన్షన్

తెలంగాణ టిఆర్టీ కి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు నియామకపత్రాలు ఎప్పుడొస్తాయా అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై తమకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ గురువారం టిఎస్పిఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు వెళ్లారు. అయితే వారు ఆందోళన చేస్తారని గ్రహించిన పోలీసు బలగాలు గాంధీభవన్ పరిసరాల్లోనే అడ్డుకుని చెదరగొట్టాయి. దీంతో గాంధీభవన్ వద్ద అర్థ నగ్న ప్రదర్శన, ధర్నా చేపట్టారు టిఆర్టి నిరుద్యోగ అభ్యర్థులు. ఈ సందర్భంగా కొందరు అభ్యర్థులను అరెస్టు చేశారు పోలీసులు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిరుద్యోగ జెఎసి ఛైర్మన్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగులకు కేసిఆర్ సర్కారు సగం గుడ్డలు ఊడబీకేసిందని మండిపడ్డారు.  తెలంగాణలో కెసిఆర్ పాలనలో మానవత్వం మంటకలిసిందన్నారు. అరెస్ట్ చేసిన వారికి కనీసం అన్నం కూడా పెట్టక పోవటం కెసిఆర్ ప్రభుత్వ రాక్షసవైకరికి నిదర్శనం అన్నారు. 

ముందస్తు ఎన్నికల కన్నా మందే టిఆర్టి అభ్యర్థులకి 1:3 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన జరిగినా, ఇంకా నియామక ఫలితాలు వెల్లడించకపోవటం కెసిఆర్ సర్కారు ఘోర వైఫల్యానికి నిదర్శనమన్నారు. నాలుగున్నరేళ్ళలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని కెసిఆర్ రెండోసారి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి తన ఉద్యోగం నిలుపుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే తన కొడుక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్యోగం ఇచ్చికుని టిఆర్టి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

కోర్టు కేసుల కుంటి సాకులు చెప్పి ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల కి చిప్పచేతిలో పెట్టటం కెసిఆర్ దుర్మార్గ పాలనకి నిదర్శనం అని విమర్శించారు. న్యాయపరమైన చిక్కులు లేని SGT/PGT అభ్యర్థుల ఫలితాలు వెంటనే వెల్లడించాలని, కోర్టు కేసులున్న వారి కేసులు తక్షణమే పరిష్కరించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ సాంకేతికత కుట్రలతో కాంగ్రెస్ ఓడినా ప్రజలకి అండగా నిలబడి ప్రజా హృదయాలను గెలుస్తూనే ఉంటుందన్నారు.