తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ (టిఎస్పిఎస్సీ) పై గత నాలుగేళ్ల పాటు పోరాటం చేసిన తెలంగాణ నిరుద్యోగ జెఎసి మరో సరికొత్త ఆందోళనకు సిద్ధమవుతున్నది. టిఎస్పిఎస్సీ ఆవిర్భావం రోజున నిరసన కార్యక్రమాలకు నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
కొలువు దీరిన కెసిఆర్ సర్కారు కు అభినందనలు తెలుపుతూ మరి నిరుద్యోగుల కొలువుల ముచ్చటేందని ప్రశ్నించారు. మీ పదవులు సరే యాడాదిన్నర దాటిన మా టిఆర్ టి కొలువుల సంగతేందో చెప్పాలని ప్రశ్నించారు.
టిఎస్పిఎస్సీ టి.ఆర్.టి (TRT టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) ఫలితాలు వెల్లడించడంలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం 11 గంటలకి TSPSC ఆవిర్భావం రోజున ఆ సంస్థ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి టిఆర్ టి అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ఆయన పిలుపునిచ్చారు.