టిడిపిలో ఎంఎల్సీ ఎన్నికల టెన్షన్

రాబోయే ఎన్నికలకు ముందే అసలు ట్రైలర్ రిలీజవుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు, ఓటములపైనే రాష్ట్రంలో టెన్షన్ పెరిగిపోతోంది. అంతకన్నా ముందే అంటే మార్చిలోనే ఎంఎల్సీ ఎన్నికలకు నగారా మోగబోతోంది. మార్చి నెల 29వ తేదీన ఎనిమిది శాసనమండలి స్ధానాలకు కాలపరిమితి పూర్తవుతోంది. అందుకనే ఆ స్ధానాల భర్తీ కోసం వారంలోగా నోటిఫికేషన్ రాబోతోంది. శాసనసభ స్ధానాల కోటాలో ఐదు, పట్టభద్రుల కోటాలో ఇద్దరు, ఉపాధ్యాయ కోటాలో ఒక స్ధానం ఖాళీ అవుతోంది. దానికే మార్చి 29లోగా ఎన్నికలు జరుగుతున్నాయ్.

ఇక్కడ విషయం ఏమిటంటే, సాధారణ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు ఏకంగా తొమ్మిది స్ధానాలకు జరగబోయే ఎంఎల్సీ ఎన్నికలు జననాడిని స్పష్టం చేస్తాయి. తొమ్మిది స్ధానాలంటే దాదాపు 13 జిల్లాల రాష్ట్రంలో 10 జిల్లాల పరిధిలోని ఓటర్లు అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక్కడ అభ్యర్ధుల గెలుపోటములంటే ప్రధానంగా తెలుగుదేశంపార్టీ, వైసిపిలే. ఎంఎల్ఏ కోటాలో ఎన్నుకునే స్ధానాలకు సమస్య లేదు. ఎందుకంటే టిడిపికి నాలుగు, వైసిపికి ఒకటి వచ్చేస్తాయి. కాకపోతే మిగిలిన మూడు స్ధానాలకు పోటీ జరుగుతుంది. ఓటర్లు పరిమితమే అయినా ఎన్నిక ఎన్నికే కదా ?

పోయినసారి జరిగిన ఎన్నికల్లో స్ధానిక సంస్ధల ఓటర్లు ఎన్నుకోవాల్సిన ఎంఎల్సీలను టిడిపి మ్యానేజే చేసి గెలుచుకుంది. అదే పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎన్నుకునే స్ధానాలన్నింటిలో ఓడిపోయింది. పట్టభద్రుల స్ధానాలకు జరిగే ఎన్నికలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్లు పాల్గొంటారు. అలాగే ఉపాధ్యాయ స్ధానానికి జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఓటర్లు పాల్గొంటారు. టిడిపి సమస్యంతా ఇక్కడే వస్తోంది. అంటే 13 జిల్లాల రాష్ట్రంలోని 7 జిల్లాల ఓటర్లు ఎన్నికలో పాల్గొనబోతున్నారు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓట్లంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సెక్షన్ అని ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. కాబట్టి వాళ్ళు వేసే ఓట్లే రాబోయే సాధారణ ఎన్నికలకు ఓ కొలమానంలాగ ఉంటుంది. ఏడు జిల్లాలోని ఓటర్లు అందునా లక్షల సంఖ్యలో ఉండే ఓటర్లు ప్రత్యక్షంగా పాల్గొనే ఎన్నిక కాబట్టే దీని ఫలితం రాపేటి సాధారణ ఎన్నికలపై ఉంటుందనే టెన్షన్ టిడిపిలో  కనబడుతోంది. అందుకే పోటీకి చాలామంది నేతలు వనకాడుతున్నారట. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.