వీడియో : క్లాస్‌ రూంలోనే పెళ్లి చేసుకున్న మైనర్లు … టీసీ ఇచ్చిన యాజమాన్యం !

పెళ్లి .. జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక. పెద్దలు, బంధుమిత్రులు , అతిధుల సమక్షంలో అంగరంగవైభవంగా జరగాల్సిన వేడుక. కానీ, ఇద్దరు మైనర్లు బొమ్మలాటగా మార్చేశారు. ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్లు ఏకంగా తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు.ఈ విచిత్ర ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. నవంబర్ 17న మైనర్లు వివాహం చేసుకున్నట్టు సమాచారం.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే … రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ బాలిక, మైనర్ బాలుడు క్లాస్ రూంనే పెళ్లి మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూంలోనే బాలిక మెడలో మైనర్ బాలుడు మూడు ముళ్లు వేశాడు. ఈ తతంగాన్ని మొత్తం మరో బాలిక వీడియో తీసింది. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లడంతో.. ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చి టీసీ ఇచ్చి కాలేజీ నుంచి పంపేశారు.

పిల్లలు చేసిన ఈ పనికి వారిద్దరి కుటుంబాలు తలలు పట్టుకున్నాయి. వారు చేసిన ఘనకార్యం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు పడ్డారు. ఇక విద్యార్థులు మాత్రం ఏదో సరదాకి చేశామని చెప్పడం గమనార్హం. సరదాగా చేసినా వాళ్లు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు వారిద్దరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.