జగన్ పై దాడి: మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన అనూహ్య వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ కుట్ర జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు అధికార ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సోమవారం పిఠాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేసారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పై జరిగిన హత్యాయత్నానికి బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. డీజీపీ వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసారు. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు.

జగన్ పై జరిగిన హత్యాయత్నంపై నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. అప్పుడే కుట్రలో భాగమైన అందరి వ్యవహారాలు బయటకు వస్తాయని ఆశించారు. గొల్లప్రోలు పూడికతీత పనులపై స్పందించిన ఆయన…గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ శివాలక్ష్మి చేతులతో పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పూడిక తీయించడం దారుణం అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దాదాపు ముప్పయ్యేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కొప్పన మోహనరావు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోహనరావు అటవీశాఖ మంత్రిగా పని చేసారు. తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.