కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఈ నెల 28న వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయారు. మొన్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కలిసి వచ్చాక ఆమె ఈ తేదీ ప్రకటించారు.
ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో పార్టీ మారడం అంటే టికెట్ మీద ఆశ, గెలుస్తామన్న ధీమా తప్పమరొటి కాదు. ఈ విషయం కిల్లీ కృపారాణికి తెలుసు, జగన్ కూ తెలుసు. రాజకీయాల్లో ఎవరి గోల్స్ వారికుంటాయి. సాధ్యమయినంత ఎక్కువ మంది సీనియర్ లీడర్లను పార్టీలో చేర్చోకవడం వల్ల ‘ అంతా అటే పోతున్నారు,’ అనే ప్రచారం జరగుతుంది. సైకాలాజికల్ ఇది రైవల్ పార్టీని వణికిస్తుందని వైసిసి వ్యూహం కావచ్చు. ఇక కృపారాణికి రాజకీయ మనుగడ అవసరం. ఆమె కాంగ్రెస్ లో ఉండే పరిస్థితిలేదు.
ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడు స్థాయికి వచ్చింది. ప్రధానంగా రెండు ప్రాంతీయ పార్టీలుంటాయి. జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బిజెపి)నామ మాత్రంగా ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ నాయకులకు మిగిలిందంతా ఏదో ఒక పార్టీలో చేరడమే. కృపారాణికి కాంగ్రెస్ మేలనిపించింది. అయితే, ఆమె ఏమాశించి పార్టీలో చేరుతున్నారనే దాని మీద రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది. కృపారాణి సన్నిహితులు మాత్రం జగన్ ‘మేడమ్ కు స్పష్టమయిన హామీ ఇచ్చారు , ఆమెకు శ్రీకాకుళం పార్లమెంటుసీటు లేదా టెక్కలి అసెంబ్లీ సీటుగ్యారంటీ’ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో గాని, ఈ టాక్ జిల్లా వైసిపిలో కలకలం సృష్టించింది.ఎందుకంటే, ఈ సీట్లను ఎప్పటినుంచో ఆశిస్తున్నవారున్నారుగా, వారి పరిస్థితి ఏమిటి?
ఇపుడు క్లుప్తంగ కృపారాణి రాజకీయాల గురించి చూద్దాం
ఆమె రాజకీయాలలోకి 2004 లో వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సందర్బంగా ఆమె కాంగ్రెస్ లో చేరారు. 2004 లో శ్రీకాకుళం ఎంపిగా పో టీచేశారు. ఓడిపోయారు. తర్వాత ఆమె జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. 2009 ఎన్నికల్లో మాత్రం శ్రీకాకుళం నుంచి పోటీ చేసి టీడీపీ కీలకనేత ఎర్రన్నాయుడిపై 82,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీనితో ఆమె జెయింట్ కిల్లర్ అని పేరు తెచ్చుకున్నారు. ఆమె పార్లమెంటులోకి తొలిరోజు ప్రవేశించినపుడు ఎర్రన్నాయుడిని వంటి బాహుబలిని వోడించిని జెయింట్ కిల్లర్ అనడం జరగింది. సోనియా గాంధీ ఆమె ప్రత్యేకంగా అభినందించారు. యుపిఎ ప్రభుత్వం లో మంత్రి కూడా అయ్యారు. 2014 లో కాంగ్రెస్ కు రాష్ట్ర విభజన దెబ్బ తగిలినపుడు ఆమె కూ దెబ్బ తగిలించి. శ్రీకాకుళం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ తన తండ్రి చాలా కాలం ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళాన్ని వెనక్కు లాగేసుకున్నారు. ఆయన 1,27,572 భారీ మెజార్టీ తో గెలుపొందారు . అపుడు కృపారాణికి కేవలం 24,163 ఓట్లువస్తే, వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 4,28, 591 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓటమి తర్వాత కాంగ్రెస్ లోనే ఉన్న క్రియాశీలంగా లేరు. ఇపుడామెకు వైసిపి ఆకర్షణీయంగా కనిపించింది. ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్రంలో బలమయిన బిసి కులం ‘కళింగ’ కు చెందడం, డాక్టర్ కావడంతో ఆమెకు టికెట్ రావచ్చని చాలా మంది అనుకుంటున్నారు. టెక్కలి అసెంబ్లీ కంటే శ్రీకాకుళం లోక్ సభసీటు ఇవ్వవచ్చని జిల్లాలో టాక్. అయితే, ఇక్కడే చిక్కు వస్తూన్నది.
ఈ రెండు స్థానాల మీద ఆశలు పెట్టుకుని ఎప్పటినుంచో పార్టీలో ఉన్నవారు ఇపుడు ఆందోళన చెందుతున్నారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయ కర్తగా మేడాడ తిలక్ పనిచేస్తున్నారు. మొదట్లో సమన్వయకర్త అంటే దాదాపు పార్టీ క్యాండిడేట్ అని ప్రచారం చేశారు. దానితో చాలా మంది సమన్వయ కర్తలు టికెట్ వచ్చినట్లే భావించి రంగంలోకి పార్టీ కార్యక్రమాల మీద ఎడా పెడా డబ్బు ఖర్చుపెట్టారు. అయితే, సర్వేలనో, మరొకటనో అక్కడ సమన్వయ కర్తలను కాదని వేరే వారిని జగన్ ఎంపిక చేస్తున్నారు. దీనితో వారు ఆందోళన చెందుతున్నారు. కొందరయితే టిడిపి లోకి దూకేందుకు కూడ రెడీ అయ్యారు. ఇలా ఆందోళన చెందుతున్న వారి జాబితోలో ఇపుడు మేడాడ తిలక్, మరొక సీనియర్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ లు కూడా చేరిపోయారు.
నాలుగున్నరేళ్లుగా పార్టీని మోస్తున్నతనకు అన్యాయం జరగుతుందేమోనని వారు అనుచరుల దగ్గిర వాపోతున్నారు.ఇప్పటి దాకా పార్టీ కోసం తాను దాదాపు మూడు నాలుగు కోట్లు ఖర్చు చేశానని, ఇపుడు తనకు అన్యాయం జరుగుతుందేమోనని తిలక్ ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఈ సీటు మీద దువ్వాడ శ్రీనివాస్ ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆయనతో సయోధ్య కుదరడంతో తిలక్ ధీమా టెక్కలి పనులు చూసుకుంటున్నారు.
శ్రీకాకుళం లోక్ సభసీటు తనదేనని చెప్పుకుంటు దువ్వాడ శ్రీనివాస్ ఒక విధంగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇపుడు కిల్లి కృపారాణి రావడం, వచ్చిందే తడవుగా శ్రీకాకుళం లోక్ సభ టికెట్ వస్తుందని చెప్పుకుంటూ ఉండటం దువ్వాడను ఇరుకునపెట్టింది.కిల్లీ కృపారాణి ఉన్నట్లుండి ఇలా ప్రాముఖ్యం సంపాదించుకోవడం వైసిపికి చెందిన మరొక ఇద్దరు సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు కూడా నచ్చడం లేదని చెబుతున్నారు. దీనింతో తిలక్ , దువ్వాడలు తమ గోడును వారికి వినిపంచి, విలువయిన సమయం, డబ్బు వెచ్చించి పార్టీకి సేవలందించిన తమకు అన్యాయం జరగుకుండా చూడాలని, తమ ఆవేదనను జగనన్న దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిసింది.
శ్రీకాకుళం లుకలుకలు ఎంతవరకు పోతాయో చూడాలి. ఇప్పటికయితే, మేడాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ లు చీరాల సమన్వయ కర్తల యడం బాలాజీ లాగా ఇప్పటికయితే పార్టీకి అల్టిమేటమ్ జారీ చేయలేదు.