తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలనేది తన ఉద్దేశ్యమని కేసీఆర్ అంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు, దాని పేరు ‘నయా భారత్’ అని విస్తృతమైన వార్తలు వెలువడ్డాయి. కానీ కేసీఆర్ మాత్రం నయా భారత్, గియా భారత్ ఏమీ లేదని, జాతీయ రాజకీయాలకు ఇంకా సమయం ఉందని, టైమ్ వచ్చినప్పుడు తానే చెబుతానని అన్నారు. ఇది కాస్త జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. కొందరు మాత్రం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక నరేంద్ర మోదీ వ్యూహం ఉందని, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ద్వారా థర్డ్ ఫ్రంట్ డ్రామా ఆడిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
అంతేకాదు కేసీఆర్ మోదీ మీద విరుచుకుపడటం, వారి విధానాలను వ్యతిరేకించడం అంతా నాటకమని, తెర వెనుక మాత్రం కేసీఆర్ మద్దతు బీజేపీకేనని కావాలంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ అభిమానులు మాత్రం కేసీఆర్ బీజేపీకి మిత్రుడు కానే కాదని అంటూ జీఎస్టీ పరిహారం, నూతన విద్యుత్ బిల్లు వంటి వాటి మీద కేసీఆర్ కేంద్రం తీరును తప్పుబట్టడాన్ని చూపుతున్నారు. దీంతో అసలు కేసీఆర్‌ది నాటకమా.. పోరాటమా అనే అనుమానం చాలామందిలో కలిగింది. ఇప్పుడు ఈ అనుమానానికి సమాదానం దొరికే సందర్భం ఒకటి రానుంది.
ఈ నెల 14 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవి కోసం బీజేపీ కూటమి ఎన్డీయే, కాంగ్రెస్ కూటమి యూపీయే అభ్యర్థులను బరిలో నిలిపింది. రాజ్యసభలో మిత్రపక్షాలతో కలుపుకుంటే ఎన్డీయేకు 101 మంది, యూపీయేకు 91 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారింది. అలాంటి పార్టీల్లో టీఆర్ఎస్ కూడ ఉంది. తెరాసకు రాజ్యసభలో 7గురు సభ్యులున్నారు. ఒకవేళ నిజంగా కేసీఆర్‌కు బీజేపీ మీద పోరాటం చేయాలనే ఉంటే ఎన్డీయే అభ్యర్థికి తన 7గురు సభ్యులతో మద్దతు ఇవ్వనివ్వదు. ఒకవేళ మోదీకి అనుకూలమైతే మద్దతిస్తుంది అంటున్నారు చాలామంది. మరి కేసీఆర్ ఎన్డీయేకు సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకించి తన హీరోయిజాన్ని నిరూపించుకుంటారో చూడాలి.