2019 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు గంపగుత్తగా వైసీపీ వైపు వెళ్ళిందన్నది నిర్వివాదాంశం. మిగిలిన కొంత భాగంలో కొంత భాగం జనసేనకీ, ఇంకొంత భాగం టీడీపీకి వెళ్ళడంలో వింతేముంది.? కాపు ఉద్యమంపై చంద్రబాబు సర్కారు మోపిన ఉక్కుపాదం, ఆ సమయంలో కాపు సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకోవడంలో జనసేనాని విఫలం కావడం వెరసి, వైసీపీకి ‘కాపు’ అడ్వాంటేజ్ లభించింది.
గడచిన మూడేళ్ళుగా ‘కాపు’ నేతలతో పవన్ కళ్యాణ్‌ని తిట్టిస్తోంది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గ పెద్దల్లో, వైసీపీ మీద తీవ్రస్థాయి అసంతృప్తి కనిపిస్తోంది. పైగా, కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులుగా భావింపబడ్తోన్న వైసీపీలోని కొందరు నేతల నుంచి పదవుల్ని లాగేసుకుని, వేరేవాళ్ళకు ఆ పదవుల్ని అప్పగించడమూ వైసీపీ మీద కాపు సామాజిక వర్గంలో నెగెవిటీ పెరగడానికి కారణమయ్యిందన్న భావన కనిపిస్తోంది.
ఇంకోపక్క అమలాపురం అల్లర్లకు సంబంధించి కాపు సామాజిక వర్గంపై వైసీపీ నేతలు కొందరు చేసిన మతిలేని వ్యాఖ్యలు కూడా, కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు వైసీపీకి దూరమయ్యేలా చేసిందన్న చర్చ జరుగుతోంది.
ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టే ‘కాపు నామకులు’ ఎవరూ లేకపోవడం గమనార్హం. ‘వాళ్ళెవరికీ, ఈ పరిస్థితుల్ని చక్కదిద్దాలన్న ఆసక్తి లేదు..’ అన్న భావన వైసీపీలో వినిపిస్తోంది. అయితే, ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.
వైసీపీ అధినేత వైఎస్ జగన్, లెక్కలన్నీ పక్కగానే వేసుకున్నారనీ, వైసీపీ మీద ‘కాపు వ్యతిరేకత’ అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి పక్కా వ్యూహం సిద్ధం చేశారనీ వైసీపీ వర్గాలంటున్నాయి.