రాజోలులో రాపాక లేకపోయినా జనసేన నిలిచి గెలిచింది 

Janasena shock to Rapaka Varaprasad 
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.  తూర్పు గోదావరి రాజోలు నియోజకవర్గం నుండి ఈయన గెలుపొందారు.  పవన్ సైతం రెండు చోట్ల ఓడిపోగా రాపాక గెలిచారు.  దీంతో జనసేన తరపున అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తారని ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు జనసేన శ్రేణులు.  కానీ రాపాక మాత్రం వంకరగా ఆలోచించారు.  కొన్ని నెలలోనే జగన్ భజన అందుకున్నారు.  జగన్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ ఆ పార్టీకి దగ్గరయ్యారు.  బేషరతుగా వైసీపీకి మద్దతు ప్రకటించేశారు.  దీంతో జనసేన శ్రేణులు తీవ్ర సంతృప్తికి లోనయ్యాయి.  పవన్ ముఖం చూసి గెలిపిస్తే వెన్నుపోటు పొడుస్తారా అని ప్రశ్నిస్తే సొంత ఇమేజ్ మీదే గెలిచాను తప్ప పవన్ పేరు చెప్పుకుని కాదని అడ్డం తిరిగారు.  
 
Janasena shock to Rapaka Varaprasad 
Janasena shock to Rapaka Varaprasad
వైసీపీ నుండి టికెట్ దొరక్కపోవడం వలనే జనసేనలోకి వచ్చానని, అంతేకానీ  సొంతగా గెలిచే సత్తా లేక కాదని బుకాయించారు.  అసలు తాను లేకపోతె రాజోలులో జనసేనకు శ్రేణులే లేవని అన్నారు.  అయితే ఆయన మాటలను అక్కడి జనసేన శ్రేణులు బాగా గుర్తుపెట్టుకున్నాయి.  టైమ్ వచ్చినప్పుడు ఎవరు ఎవరి మీద ఆధారపడి గెలిచారో నిరూపించాలని అనుకున్నాయి.  అందుకు పంచాయతీ ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి.  నియోజకవర్గంలోని 10 పంచాయతీల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.  వీరంతా ఎమ్మెల్యే రాపాక మద్దతు లేకుండానే గెలిచినవారు.  డమటిపాలెం(జనసేన), టెకిశెట్టిపాలెం(జనసేన), కేశవాదాసుపాలెం(జనసేన), కాట్రేనిపాడు(జనసేన), ఈటుకూరు (జనసేన), మేడిచర్ల పాలెం (జనసేన ), బట్టేలంక(జనసేన), రామరాజులంక(జనసేన), కత్తిమండ(జనసేన), కూనవరంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు.
 
పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులను పూర్తిగా గెలిపించి జగన్ మన్ననలు  పొందాలని అనుకున్నారు.  ప్రామిసరీ నోట్ల మీద హామీలను గుప్పించారు.  జనసేన అభ్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు.  కానీ అంతా చేసినా జనసేన ఉనికి చాటుకుంది.  రాపాకకు షాకిస్తూ 10 పంచాయతీల్లో గెలుపొందారు జనసేన అభ్యర్థులు.  దీన్నిబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు విజయం జనసేన శ్రేణుల మూలంగానే సాధ్యమైంది తప్ప రాపాక ఒంటరిగా ఆ స్థానాన్ని గెలవలేదని రూఢీ అయింది.