తెలుగుదేశంపార్టీ వర్గాల నుండి అందుతున్న సమచారం ప్రకారం అలాగే అనుకోవాలి. టిడిపి నేతలపై జరుగుతున్న ఐటి దాడులపై చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే . వ్యాపారస్తులపై దాడులు జరిగినా, సుజనా చౌదరి, సిఎం రమేష్ లపై దాడులు జరిగినా అదేదో రాష్ట్రంపైన, ప్రజాస్వామ్యంపైన దాడులు జరుగుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. గతంలో ఎన్నడూ చేయనంతగా చంద్రబాబుతో సహా అందరూ గోల చేసేస్తుండటమే విచిత్రంగా ఉంది.
పార్టీ వర్గాల ప్రకారం చంద్రబాబు మొదటు క్రిందస్ధాయి నేత వరకూ ఐటి రెయిడ్లపై చేస్తున్న గోలంతా కేవలం మీడియాలో బిజెపిని బూచిగా చూపించటానికేనట. నిజానికి మరిన్ని రెయిడ్లు జరగాలని టిడిపి నేతలందరూ కోరుకుంటున్నారట. విచిత్రంగా ఉన్నా ఆ కోరిక వెనుక పెద్ద వ్యూహమే దాగున్నదని సమాచారం. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి తయపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయించటానికి కుట్రలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొట్టటం అందరికీ తెలిసిందే.
నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి విశృంఖలమైపోయిన విషయం అందరూ చూస్తున్నదే. కాబట్టి అవినీతిపై ఎప్పుడో ఒకపుడు ఐటినో లేకపోతే ఈడినో దాడులు జరుపుతుందని చంద్రబాబు అనుమానించారు. అందుకని ముందుజాగ్రత్తగా అవినీతిపరులపై జరిగే దాడులను కక్షసాధింపులుగా చంద్రబాబు తన మీడియాలో చిత్రీకరించారు. సరే, చంద్రబాబు అనుమానించినట్లుగానే టిడిపి నేతలో లేకపోతే వారితో సంబంధాలున్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై దాడులు మొదలయ్యాయి.
దాంతో జనాల సానుభూతికోసం ఐటి, ఈడి దాడులను కక్షసాధింపు చర్యలుగా చంద్రబాబు అండ్ కో తెగ ప్రచారం చేస్తోంది. ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకనే టిడిపి నేతలు సానుభూతి కోసం బాగా గోల చేసేస్తున్నారు. చూడబోతే తమపై మరిన్ని ఐటి, ఈడి దాడులు జరగాలని చూస్తున్నట్లుంది టిడిపి నేతల వాలకం. తమపై దర్యాప్తు సంస్ధల దాడులు ఎంత ఎక్కువ జరిగితే అంతగా ప్రధానమంత్రి నరేంద్రమోడిని బూచిగా చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలని టిడిపి నేతలు చూస్తున్నట్లే ఉంది.