గ్రహాలే చంద్రబాబుకు దిక్కా ? సెంటిమెంటు ప్రయోగం

చంద్రబాబునాయుడును గ్రహస్ధితి మాత్రమే అధికారంలోకి తీసుకు రాగలవా ? చూడబోతే అలాగే ఉంది పరిస్ధితి. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే మళ్ళీ అధికారంలోకి రావటానికి చంద్రబాబుకు అవకాశాలు తక్కువే అనిపిస్తోంది. అజ్ఞాత శతృవు, ముసుగులో ఉన్న పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంత సహకరిస్తున్నా చంద్రబాబు అధికారంలోకి వచ్చేది అనుమానంగానే ఉంది.

అందుకనే చంద్రబాబు మీడియా చివరకు గ్రహాలను రంగంలోకి దింపినట్లుంది. చంద్రబాబుకు బలంగా మద్దతిచ్చే మీడియా సంస్ధల్లో ఒకటి చంద్రబాబే మళ్ళీ సిఎం అవుతారంటూ జాతకాన్ని ప్రచురించింది. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ జాతకాలను కూడా వేసింది లేండి. ఏ లెక్క ప్రకారం చూసినా పవన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ముందుగానే గ్రహబలం ప్రకారం పవన్ అధికారంలోకి రారంటూ ప్రచారం మొదలుపెట్టింది.

రాబోయే ఎన్నికల్లో జగనే కాబోయే సిఎం అనే ప్రచారానికి విరుగుడుగా జగన్ కు గ్రహబలం లేదుకాబట్టి సిఎం అవరంటూ జోస్యం చెప్పింది. ముందుగా బ్రహ్మాండమని అనిపించినా చివరలో జగన్ చతికిలపడతారంటూ తేల్చేసింది. అందుకు గ్రహబలం సరిగా లేకపోవటమే అని కూడా సూత్రీకరించింది లేండి.

చంద్రబాబు ఎలాగైనా సిఎంను చేయాలని కంకణం కట్టుకున్న ఇదే మీడియా కాబోయే సిఎం చంద్రబాబే అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఎలాగంటే, ముందు ఇబ్బందులు పడినా, ఓడిపోతామనే భయం ఉన్నా చివరలో విజయం మాత్రం చంద్రబాబుదేనట. ఎందుకంటే, గ్రహబలమే కారణమట. జాతకాల ఆధారంగా ముగ్గురి జాతకాలు, దశలు, అంత్యదశలు, వాటి గోచారాలు తదితరాలన్నీ ప్రచురించింది. మీడియా వరస చూస్తుంటే చంద్రబాబు కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నట్లుంది.