ఆ నియోజకవర్గంపై ఆశలు వదిలేసుకున్నట్లేనా ? వైసిపిదే రికార్డు

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. కానీ ఒక్కోసారి సామెతలు తల్లక్రిందులవుతుంటాయి. ఇతర నేతల విషయాన్ని పక్కనపెడితే చంద్రబాబునాయుడు విషయంలో మాత్రం ఆ సామెత తల్లక్రిందులైన విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. ఈ పాటికే విషయం అర్ధమైపోయుండాలి. అదేలేండి చంద్రబాబు పుట్టి, పెరిగిన సొంత నియోజకవర్గం చంద్రగిరి గురించే ఇదంతా. ఎప్పుడో దశాబ్దాల క్రితమే చంద్రగిరిని చంద్రబాబు వదిలేసి వెళ్ళిపోయారు. నిజానికి కష్టమైనా, నష్టమైనా సొంత నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఏ నేత కూడా అనుకోరు. కానీ చంద్రబాబు వైరెటీ కదా ? అందుకనే 30 ఏళ్ళ క్రితం కుప్పంకు వలస వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంత వరకూ చంద్రగిరి వైపు పొరపాటున కూడా తిరిగి చూడలేదు.

  

పోనీ చంద్రగిరి నుండి పోటీ చేయకపోతే పోయే ఎవరినో ఒకిరిని పోటీకి పెట్టి గెలిపించుకుంటూ నియోజకరవర్గంలో పట్టు కొనసాగిస్తున్నారా అంటే అదీ లేదు. టిడిపి గెలిచింది చివరిసారిగా 1994లోనే. తర్వాత మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగా గల్లా అరుణకుమారి గెలిస్తే నాలుగోసారి వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలిచారు. చెవిరెడ్డి గెలవటమే భారీ రికార్డుతో గెలిచారు 2014లో. పోయిన ఎన్నికల్లో చెవిరెడ్డికి 100924 ఓట్లోస్తే టిడిపి అభ్యర్ధి గల్లా అరుణకు 96406 ఓట్లొచ్చాయి.

ఇక్కడ చెవిరెడ్డి గురించి ఓ విషయం చెప్పుకోవాలి. జనాలకు కాంగ్రెస్ నేతగానే పరిచయమైనా రాజకీయపరిణమాల వల్ల వైసిపిలో చేరారు. పోయిన ఎన్నికల్లో చంద్రగిరి నుండి పోటీ చేసి లక్ష ఓట్ల మార్కునుదాటారు. చంద్రగిరి నియోజకవర్గం పుట్టినప్పటి నుండి  ఏ అభ్యర్ధికి కూడా లక్ష ఓట్లు రాలేదు. అటువంటిది పోటిచేసిన మొదటి ఎన్నికలోనే లక్ష ఓట్లను దాటటమంటే రికార్డే కదా ? గెలిచిన దగ్గర నుండి చెవిరెడ్డి నియోజకవర్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళుతూనే మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో జనాల్లో చొచ్చుకుపోతున్నారు.

చెవిరెడ్డి జోరుకు బ్రేకులు వేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం  కావటం లేదు. చెవిరెడ్డికి గట్టిపోటీ ఇచ్చే నేత కోసం పార్టీలో ఎంత వెతికినా ఎవరూ దొరకటం లేదు. సమన్వయకర్తగా ఉండలేనని గల్లా తప్పుకోవటంతో టిడిపి పరిస్ధితి మరింత దిగజారిపోయింది. రేపటి ఎన్నికల్లో ఎవరో ఒకిరిని పోటికి దింపటం తప్ప చేయగలిగేదేం లేదన్నది చంద్రబాబుకు అర్దమైపోయింది. సొంత నియోజకవర్గంలోనే టిడిపికి ఇంతటి గడ్డు పరిస్దితి ఎందుకుంది ? అని ప్రశ్నించుకుంటే కేవలం చంద్రబాబు మీద వ్యతిరేకతే అని స్పష్టంగా అర్దమైపోతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కొడుకు లోకేష్ పోటీ చేయటానికి నియోజకవర్గాలను వెతుకుతున్నపుడు కూడా చంద్రగిరి గురించి మాత్రం ఆలోచించటం లేదంటేనే పరిస్ధితి అర్ధమైపోతోంది.  చూడబోతే చంద్రబాబు  చంద్రగిరిని వదిలేసుకున్నట్లే కనబడటం లేదూ ?