చంద్రబాబుకు బిజెపి తలుపులు మూసేసిందా ?

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒకవైపేమో టిడిపిని బిజెపిలో విలీనం చేసేస్తామంటూ మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి చెబుతుంటే ఇంకోవైపు కన్నా ఏమో చంద్రబాబుకు బిజెపి తలుపులు మూసేసిందని చెబుతున్నారు.

చంద్రబాబు పాలనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఊరుకోవటం కాదని విచారణలు జరిపి చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీని నడపటం చంద్రబాబుకు సాధ్యం కాదని టిడిపి నేతలు డిసైడ్ చేసేసినట్లు కన్నా చెప్పటమే విచిత్రంగా ఉంది.

అందుకనే టిడిపి నేతలు బిజెపిలో చేరుతున్నట్లు చెప్పారు. ఇంకా కొంతమంది వచ్చేందుకు రెడీగా ఉన్నారని తమ పార్టీలో చేరేందుకు ఎవరు వచ్చినా చేర్చుకుంటామని స్పష్టం చేశారు. అంటే వలసలను ఆహ్వానిస్తు బిజెపి బార్లా గేట్లు తెరిచేసినట్లు అర్ధమవుతోంది.

టిడిపితో కలిసి పనిచేసే విషయమై తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడినట్లు కన్నా తెలిపారు. తన ప్రశ్నకు షా మాట్లాడుతూ చంద్రబాబుతో కలిసి పనిచేసే సమస్యే లేదని స్పష్టంగా చెప్పినట్లు చెప్పారు. అయితే ఇప్పటికే చంద్రబాబు బిజెపితో రెండుసార్లు పొత్తులు పెట్టుకుని రెండుసార్లు కటీఫ్ చెప్పిన విషయాన్ని కన్నా మరచిపోయినట్లున్నారు.