కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రాలకు రావలసిన జీఎస్టీ ఆదాయం చాలావరకు తగ్గిపోయింది. దీంతో ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ విపత్కర సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని పూర్తిగా చెల్లించి తమను ఆదుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కానీ కేంద్రం నుండి గత కొన్ని నెలలుగా కనీస స్పందన ఇవ్వకుండా నాన్చుతూ వస్తున్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు రావలసిన జీఎస్టీ ఆదాయం తగ్గితే ఐదేళ్ళ పాటు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీని అమలులోకి తెచ్చే సమయంలో దీన్ని చట్టంగా చేశారు. ఈ చట్టం మేరకు గత కొన్ని నెలలకు గాను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2019 డిసెంబర్ నుండి 202 ఫిబ్రవరి వరకు బకాయిలు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రావలసిన మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు నెలలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటినే చెల్లించమని ప్రభుత్వాలు అడుగుతున్నాయి.
జీఎస్టీ పరిహారం చెల్లింపు అంటే:
మొదట్లో ఈ చట్టం ఆమోదించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జీఎస్టీ పద్దతిలో రాకపోతే ఏం చేయాలని ప్రశ్నించాయి. అప్పుడు కేంద్రం ప్రతి యేడు జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 14 శాతం పెరగాలని లేకుంటే నష్టపరిహారం చెల్లిస్తామని అంది. దీని కోసం జీఎస్టీ సెజ్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని ఉత్పత్తుల మీద వచ్చే పన్నును ఈ సెజ్ కిందికి తీసుకొచ్చారు. దీన్ని మొత్తాన్ని జీఎస్టీ చట్టంగా చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అయిష్టంగానే జీఎస్టీ విధానాన్ని ఆమోదించాయి. ఈ విధానంతో పెట్రోల్, లిక్కర్ మినహా మిగతా అన్ని ఉత్పత్తుల మీద పన్నును విధించే హక్కును రాష్ట్రాలు వదులుకున్నాయి.
ఈ విధానంలో రావలసిన ఆదాయం తగ్గితే కేంద్రం పరిహారం చెల్లించాలి. కానీ ఇప్పుడు కేంద్రం అడ్డం తిరిగింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకే కాదని కేంద్ర ప్రభుత్వానికి సైతం ఆదాయం తగ్గిందని, అలాంటి పరిస్థితుల్లో పరిహారం చెల్లించడం సాధ్యం కాదని అంటున్నాయి. ఫిబ్రవరి వరకు జీఎస్టీ ఆదాయం కేంద్రానికి లక్ష కోట్లకు పైగానే ఉండేది. కానీ మార్చికి అది 97,000 కోట్లకు తగ్గింది, జూన్ నెలకు 90,917 కోట్లు, జూలైకు 87,422 కోట్లు, ఆగష్టు నెలలో 86,499 కోట్లుగా ఉంది. ఈ కారణం చూపే తాము బకాయిలు చెల్లించలేమని అంటోంది. పైగా కరోనా సంక్షోభం అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ అని, దానికి కేంద్రం మాత్రం ఏం చేయగలదని అడ్డం తిరిగింది.
జగన్ ఎందుకు అడగలేకపోతున్నారు:
ఇలా కేంద్రం ఏకంగా చట్టాన్నే ఉల్లఘించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిరాశ చెందాయి. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇలా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాయి. దీంతో కేంద్రం కావాలంటే రాష్ట్రాలను అప్పులు ఇప్పిస్తామని, ఆర్థిక వ్యవస్థ కుదుటపడ్డాక ఐదేళ్ళకు ఇంకో రెండేళ్లు కలిపి మొత్తం 7 సంవత్సరాలు జీఎస్టీ పరిహారం అందిస్తామని, అదనంగా అందే రెండేళ్ల పరిహారంతో పుచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టుకోమని ఆఫర్ ఇచ్చింది. దీన్ని గొప్ప అవకాశంగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. నిజంగా అంత మంచి ఆలోచనే అయితే ఆ అప్పులేదో కేంద్ర ప్రభుత్వమే చేసి ఆ డబ్బుతో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వొచ్చు కదా. భవిష్యత్తులో ఆదాయం పెరిగాక దాంతో అప్పుల వడ్డీ కట్టుకోవచ్చు కదా. కానీ అలా చేయరు. ఆ అప్పుల భారమేదో రాష్ట్రాలే మోయాలి. ఈ వైఖరిని చూస్తే భవిష్యత్తులో ఇస్తామంటున్న ఏడేళ్ల పరిహారం మీద నమ్మకం కుదరట్లేదు.
ఈ తీరును బీజేపీ యేతర ప్రభుత్వాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులంతా మోదీని గట్టిగా నిలదీస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే నేరుగా మోదీకి లేఖ పంపారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని తగ్గించడం, అప్పులు చేసుకోమనడం సరికాదని, ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది, జీఎస్టీ విధానం వలన రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది అంటూ మొహమాటం లేకుండా మాట్లాడారు. నిజానికి అలాగే మాట్లాడాలి కూడ. రాజ్యాంగం, చట్టం ప్రకారం జీఎస్టీ పరిహారం రాష్ట్రాల హక్కు. ఎన్ని ఇబ్బందులున్నా ఆ హక్కుకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. అందుకే కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ విషయమై మాట కూడా మాట్లాడలేదు. ఆర్థిక మంత్రి బుగ్గన సహా వైసీపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. అసలే ఆదాయం లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. వేతనాలకు, ఖర్చులకు అప్పులే దిక్కయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడ జగన్ మౌనం వహించడం, మోదీని నిలదీసే ధైర్యం చేయకపోవడం వెనుక కారణాలు వారికే తెలియాలి.