కుమారుడి కోసం..!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అహ్మదుల్లా తెలుగుదేశం పార్టీలో చేరారు. త‌న కుమారుడు అష్రాఫ్ స‌హా ఆయ‌న చంద్ర‌బాబు స‌మక్షంలో ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అహ్మ‌దుల్లా టీడీపీ అభ్య‌ర్థిగా క‌డ‌ప నుంచి పోటీ చేస్తార‌ని భావించారు. అనూహ్యంగా త‌న కుమారుడిని రంగంలోకి దింపారు. క‌డ‌ప అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా అష్రాఫ్ నియ‌మితుల‌య్యారు.

అహ్మ‌దుల్లా దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స‌న్నిహితుడు. ఆయ‌న హ‌యాంలో రెండుసార్లు క‌డ‌ప నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మంత్రిగా ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆయ‌న కాంగ్రెస్‌లోనే కొన‌సాగిన‌ప్ప‌టికీ.. క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఆయ‌న టీడీపీలో చేరారు. మొద‌ట ప్ర‌తిప‌క్ష‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆస‌క్తి చూపారు. దీనిపై ఆ పార్టీ నాయ‌కుల‌ను సంప్ర‌దించారు. అహ్మ‌దుల్లా చేరిక‌కు వైఎస్ఆర్ సీపీ నేత‌లు సుముఖంగా ఉన్న‌ప్ప‌టికీ.. టికెట్‌ను మాత్రం ఖ‌రారు చేయ‌లేదు.

ప్ర‌స్తుతం క‌డ‌ప స్థానం వైఎస్ఆర్ సీపీదే. మైనారిటీ వ‌ర్గానికే చెందిన అమ్జాద్ భాషా ఇక్క‌డ ఎమ్మెల్యే. ఆయ‌న‌పై స్థానికంగా ఎలాంటి వ్య‌తిరేక‌తా లేదు. క‌లుపుగోలు మ‌నిషి అనే పేరుంది. వివాద‌ర‌హితుడు. ఈ సారి కూడా అమ్జాద్‌భాషాకే టికెట్ ఖాయమ‌ని సూచ‌న‌ప్రాయంగా తెలిపారు. దీనితో- ఆయ‌న టీడీపీలో చేరిన‌ట్లు భావిస్తున్నారు.