వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించి చరిత్రలో నిలిచిపోవాలనేది జగన్ భావన. కానీ మొదటి నుండి ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాయలసీమకు నీళ్లు తీసుకుపోతే తెలంగాణలోని పలు జిల్లాలు ఎండిపోతాయని కేసీఆర్ అడ్డం తిరిగారు. బేసిన్లు బేధజాలు ఉండవంటూ ఆనాడు చేసుకున్న మైత్రీ ఒప్పందాన్ని కూడ పక్కనపెట్టి జగన్ చర్యలను ఖండిస్తున్నారు. జగన్ సైతం తగ్గట్లేదు. తమకున్న వాటా మేరకే నీళ్లు తీసుకుంటున్నామని, ఈ ప్రాజెక్ట్ అక్రమమైతే కాళేశ్వరం సహా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమమే అంటూ గట్టిగా అడ్డం తిరిగారు. దీంతో జలవివాదం ముదురు పాత పరిస్థితులే పునరావృతమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కట్టడం చట్టవిరుద్దమని కేఆర్ఎంబీకి పిర్యాధు చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణా జలాల్లో తమకున్న వాటాను మాత్రమే వాడుకుంటామని, ఇందులో ఎవరికీ అన్యాయం జరగదని, ఎవరు అడ్డు చెప్పినా ఆగేది లేదని అంటూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీన్ని కూడ కృష్ణా రివర్ బోర్డ్ ఆక్షేపించింది. గొడవ పెద్దది కావడంతో కేంద్రం కలుగజేసుకుని సంబంధిత బోర్డులకు డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఒప్పుకునం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఏపీ వైపు నుండి సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా రోజూ మూడు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించే సీమ పథకం డీపీఆర్‌ను ఈ-పామ్స్ ద్వారా గత నెల 16వ తేదీన ఈఎన్‌సీ పంపారు.
అయితే ఈ రిపోర్టులో ప్రాథమిక సమాచారం లేదంటూ కేంద్ర జల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేసింది. వ్యక్తం చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు కూడ వేసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌ను ఎలా సమర్పించాలో తమ వెబ్‌సైట్ చూసి తెలుసుకోవాలని చెబుతూ రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు జల సంఘం డైరెక్టర్ ఎన్.ముఖర్జీ లేఖ పంపారు. రిపోర్టులో హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అంశాలు, సాగు ప్రణాళిక డిజైన్, అంచనా వ్యయానికి సంబంధించిన విషయాలు, డ్రాయింగులు కూడా లేవని అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితమైన రిపోర్ట్ తయారుచేసి పంపాలని తెలిపింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ విషయంలో ఇలా పదే పదే తప్పులు దొర్లుతుండటం చూస్తే ప్రజలకు పాలకుల, అధికారుల చిత్తశుద్ధి మీద అనుమానాలు రేకెత్తడంలో ఆశ్చర్యం ఏముంటుంది.