CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం చేసుకొని NPR(నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) NRC (జాతీయ పౌరుల జాబితా) దేశం ముందుకు వచ్చాయి.

పార్లమెంటులో ఇవి ఆమోదింపబడే సమయంలో మన రాష్ట్రంలోని అధికార ప్రతి పక్షాలు రెండూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వంతపాడాయి. రెండు పక్షాలకు వున్న బలహీనతలు అలాంటివి – మరి. తర్వాతనే అసలు సమస్య మొదలైంది. దేశంతో పాటు మన రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో వీటికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో మైనార్టీలే కాకుండా అన్ని మతాల వారు ప్రగతి శీల వాదులు పాల్గొంటున్నారు. ఇటీవల అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున సభలు ప్రదర్శనలు జరిగాయి. మైనారిటీలు ఇంత పెద్ద సభ ఇది వరలో జరిపి వుండ లేదు. అంతకన్నా ఎక్కువగా కడప జిల్లాలో పెద్ద ప్రదర్శన జరిగింది. తొలుత భిన్నమైన వార్తలు వచ్చినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.

ఈ ఉద్యమం క్రమేణా ఊపు అందుకొంటూ వుంది. ఈ లోపు పులి మీద పుట్ర లాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వీటికి వ్యతిరేకంగా శాసనసభ లో తీర్మానం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు అసలు సమస్య ఏమంటే రేపు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో వీటికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వచ్చే డిమాండ్ ను ముఖ్యమంత్రి ఏలా తట్టుకొని నిలబడతారు? మొదలే ఆర్థిక లోటు రాష్ట్రం. కేంద్రం దయ మీద ఆధార పడాలి. కెసిఆర్ లాగా కాలు మీద కాలు వేసుకు కూర్చొనే వీలు లేదు.వీటికి తోడు మూడు రాజధానులు హైకోర్టు బదలీ అన్నిటికన్నా శాసన మండలి రద్దు కావాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసన సభ లో ముఖ్యమంత్రి తీర్మానం చేసే అవకాశమే లేదు. అట్లని వీటిని పట్టించుకోక పోతే వాస్తవంలో వైసిపి కి వున్న ఓటు బ్యాంకుకు కన్నం పడుతుందనే భయం వెన్నాడుతోంది.

ఒక విధంగా ముఖ్యమంత్రికి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఏ శుభ ముహూర్తాన ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారో ఏమో గాని అప్పటి నుండి ఇప్పటి వరకు రోజూ సమస్యలే. ఇందులో కొన్ని స్వయంకృతం అయితే మరికొన్ని పరిస్థితుల ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి