కర్నూలులోని జగన్నాథగుట్ట ప్రాంతంలో 250 ఎకరాల్లో రాష్ట్ర హైకోర్టు నిర్మితమవుతుందనీ, జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రక్రియ హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చిన తర్వాత ప్రారంభమవుతుందనీ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గతంలో ఏకైక రాజధాని అమరావతికి మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది.
అమరావతి నుంచి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపు, కర్నూలుకు జ్యుడీషియల్ క్యాపిటల్ తరలింపుకు వీలుగా శాసన సభలో ఇప్పటికే తీర్మానం చేయడం కూడా జరిగింది. శాసన మండలిలో గందరగోళం నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలోకి వెళ్ళింది. హైకోర్టలో రాజధాని విభజనకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్ల విచారణ జరుగుతుండగా, మూడు రాజధానులకు సంబంధించి స్టేటస్ కో వుంది.
సరిగ్గా మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ, అందునా పోలింగ్‌కి ముందు బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలులో జగన్నాథగుట్ట వద్ద జ్యుడీషియల్ క్యాపిటల్.. అని ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ ప్రకటనలో కర్నూలు వైసీపీలో ఊపు తెస్తోంటే, గుంటూరు – కృష్ణా జిల్లాల్లో వైసీపీని ఆందోళనలోకి నెట్టేసిందనే వాదన వినిపిస్తోంది. అయినా, న్యాయ రాజధానికి కేవలం 250 ఎకరాలు సరిపోతాయా.? దాంతోనే, కర్నూలుకి రాజధాని హోదా వచ్చేస్తుందా.? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. రాజధాని అంటే వేల ఎకరాల వ్యవహారమే. విశాఖలో అయినా, పెద్దయెత్తున భూముల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం సమీకరించాల్సి వుంది. ఇక, అమరావతి కోసం చంద్రబాబు హయాంలో దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరించిన విషయం తెలిసిందే. కాగా, హైకోర్టు నుంచి సానుకూల తీర్పు రాగానే జ్యుడీషియల్ క్యాపిటల్ పనులు ప్రారంభమవుతాయని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు.