జనసేన, బీజేపీల పొత్తు నానాటికీ అర్థాంతరంగా ముగిసిపోయే స్థితిలోకి వెళుతోంది తప్ప కలిసి మెలసి వెలిగే దిశగా పోతున్నట్టు లేదు. తిరుపతి ఉపఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఏ పార్టీ వ్యక్తిని నిలబెట్టాలనే విషయమై తీవ్రమైన చర్చలు, వాదోపవాదనలు జరుగుతున్నాయి. కేంద్ర నాయకత్వం నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. పవన్, సోము వీర్రాజు కలిసి మాట్లాడుకున్నా ఫైనల్ డెసిషన్ ఏమిటనేది తేలలేదు. పవన్ మాత్రం ఎప్పుడు లేని విధంగా సీటు తమ అభ్యర్థికే కావాలంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అయితే పోటీ చేస్తే గెలిచేస్తాం అనే రీతిలో మాట్లాడుతున్నారు.
గ్రౌండ్ లెవల్ వాస్తవాలని పరిశీలించుకుంటే బీజేపీ కంటే జనసేనకు కాస్తో కూస్తో ఆదరణ ఎక్కువ. ఇక్కడ జనసేన అవసరం బీజేపీకి ఉండే తప్ప బీజేపీ అవసరం జనసేనకు తక్కువ. బలాబలాలను పక్కనబెట్టి ఆలోచిస్తే మిత్రధర్మం దృష్ట్యా అయినా బీజేపీ సర్దుకునిపోయి జనసేనకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ బీజేపీ కోసం చెప్పుకోదగిన త్యాగాలు చేశారు. 2014 ఎన్నికలప్పుడు సొంత లేదా పార్టీ ప్రయోజనాన్ని ఆశించకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చాడు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడ అడగలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టు ఇవ్వమని డిమాండ్ పెట్టలేదు. రాజ్యసభకు ఎన్నుకోమని అడగలేదు. నిస్వార్థంగానే కలిసి పనిచేశారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడ 50 స్థానాల వరకు పోటీకి దిగాలని భావించి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టుకున్నారు. కానీ కిషన్ రెడ్డి వెళ్లి మాట్లాడగానే ఏపీలో పొత్తులో ఉన్న విషయానికి విలువ ఇచ్చి పోటీ నుండి వెనక్కుతగ్గి బీజేపీ కోసం పనిచేశారు. నామినేషన్లు ఉపసంహరణ అనగానే పవన్ మీద సొంత కార్యకర్తలే అసహనం వ్యక్తం చేశారు. అలాగే 2014 పొత్తును వద్దనుకుని ఒంటరిగా ఉంటూ హోదా డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న తరుణంలో బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పొత్తు కుదుర్చుకున్నారు. ఈ పొత్తుతో పవన్ తన ఆశయాలను, ఉద్దేశ్యాలను, లక్ష్యాలను కాస్త పక్కన పెట్టినట్టే అయింది. ఇలా బీజేపీ కోసం పలుమార్లు త్యాగాలు చేసి, విమర్శలకు గురయ్యారు పవన్. అలాంటి వ్యక్తికి తిరుపతి ఉపఎన్నిక సీటును వదిలేయడం బీజేపీ మిత్ర ధర్మం. జనసేన అభ్యర్థిని నిలబెట్టి అతని గెలుపు కోసం బీజేపీ నాయకులంతా కష్టపడితే స్నేహం మరింత బలపడనుండి. జనసేన శ్రేణుల్లో ఉన్న సందేహాలు కూడ తొలగిపోతాయి.