మంత్రి అఖిల ప్రియ బాటలో తమ్ముడు సంచలన నిర్ణయం

కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. మంత్రి అఖిల ప్రియా వర్సెస్ పోలీసులుగా వార్ కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో కార్డన్ సెర్చ్ పేరుతో పోలీసులు టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారని దానికి నిరసనగా మంత్రి అఖిల ప్రియ 5 రోజుల క్రితం గన్ మెన్లను తిరస్కరించింది. అఖిల ప్రియకు మద్దతుగా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి తన గన్ మెన్లను తిరస్కరించారు.

5 రోజుల క్రితం ఆళ్లగడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయితే పోలీసులు సెర్చ్ పేరుతో వేధింపులకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారని బాధితులు అఖిల ప్రియకు తెలిపారు. దీంతో అఖిల ప్రియ పోలీసుల పై సీరియస్ అయ్యింది. పేదలు మీకు రౌడీలలాగా కనిపించారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె తన గన్ మెన్లను వెనక్కి పంపింది. దీని పై కర్నూల్ ఎస్పీ వివరణ ఇచ్చినా అఖిల ప్రియ శాంతించలేదు. అక్క అఖిల ప్రియకు సంఘీ భావంగా తన గన్ మెన్లను కూడా ఉపసంహరించుకుంటున్నానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలోనే వివాదం కొనసాగుతున్నా ఇంత వరకు పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ పెద్దలు స్పందించలేదు. 

ఐదు రోజులుగా అఖిల ప్రియ సెక్యూరిటి లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన పర్యటనలకు పోలీసులు  వచ్చినా వారిని అఖిల ప్రియ వెనక్కి పంపించారు. పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రి అఖిల ప్రియ కార్యక్రమాలకు వెళుతున్నారు. పోలీసులు మాత్రం ప్రొటోకాల్ ప్రకారం మంత్రికి భద్రత కల్పించడం తమ బాధ్యత అని తాము సెక్యూరిటి కల్పిస్తామన్నారు. 

మంత్రి అఖిల ప్రియ నిర్ణయం పై కర్నూలు జిల్లా ఎస్పీ స్పందించారు. విధి నిర్వహణలో భాగంగానే తాము కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఏ పార్టీ వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకొని తాము కార్డన్ సెర్చ్ నిర్వహించలేదన్నారు. అందరి ఇళ్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఏ ఒక్కరిని టార్గెట్ చేయలేదన్నారు. శాంతి భద్రతల సమస్య ఉన్నప్పుడు తమ విధి నిర్వహణ తాము నిర్వహిస్తామన్నారు. దీనిని ప్రభుత్వంలో ఉన్న మంత్రి అర్దం చేసుకోవాలన్నారు. భూమా అఖిల ప్రియ నిర్ణయానికి మద్దతుగా నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మనందరెడ్డి కూడా తన గన్ మెన్లను వెనక్కి పంపడంతో కర్నూలు  రాజకీయాలు హీటెక్కాయి.