మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. ఆయన ఎవరి మాట వినడు. నిర్ణయం తీసుకున్నాడంటే ఏది ఏమైనా సరే అది జరగాల్సిందే. అందుకే అతనికి రాజకీయ అపర చాణక్యునిగా పేరొచ్చింది. తెలంగాణ రాజకీయాలలో పలు రికార్డులు తిరగరాసిన చరిత ఆయన సొంతం. అటువంటి సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. మరో నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ తన కసరత్తును మొదలు పెట్టింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయి. దీంతో వైసిపి, టిడిపి, కాంగ్రెస్, జనసేన మధ్య చాలా గట్టి పోటి ఏర్పడింది. వైసిపి, టిడిపి మధ్యనే చాలా గట్టిపోరు సాగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో వైసిపికి టిఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి తెలపడంతో దీని పై అందరిలో చర్చ ప్రారంభమైంది.

త్వరలో జరగబోయే ఏపి శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో వైసిపికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి అభిద్ రసూల్ ఖాన్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా జగన్ కే ఓటేయాలని తమ పార్టీ కోరనుందని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత లౌకిక వాద, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. వైఎస్ జగన్ లౌకిక వాది మరియు పేద ప్రజల స్నేహితుడు అని అన్నారు. ఆంధ్రాలో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు, బంధువులు, వ్యాపార భాగస్వాములంతా వైసిపికి ఓటేయాలని కోరుతామన్నారు. లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికల్లో వైసిపి భారీ మెజార్టీతో గెలుస్తుందని రసూల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయాన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం నిర్వహించారు. దీంతో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మొత్తం చంద్రబాబునే విమర్శించారు. ఒకనొక దశలో తెలంగాణలో చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ప్రచారం నడించిందని పలువురు అన్నారు. దీంతో చంద్రబాబును దెబ్బకొట్టడానికే కేసీఆర్ వైసిపికి మద్దతివ్వనున్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ఏపీలో రెండు, మూడు సభలల్లో జగన్ తరపున కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది. దీంతో ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు హీటెక్కాయి.