అమరావతి : 21వ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని , ఇలాంటి రాష్ట్రానికి తగిన ఆర్థిక చేయూతను అందించడంలో 15వ ఆర్థిక సంఘం ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15 వ అర్థిక సంఘాన్ని కోరారు.
రాష్ట్ర విభజన చట్టంలోనూ, పార్లమెంటులోనూ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంలో కేంద్రం తప్పించుకోజాలదని, పొరుగు రాష్ట్రాల స్థాయికి చేరుకునేందుకు తగిన నిధులిచ్చి ఆదుకునేలా సిఫారసులు చేయాలని కోరారు.
నంద్ కిశోర్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్న 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. రాష్ట్ర మంత్రిమండలిలోని ముఖ్యులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పి, తరువాత 14వ ఆర్థిక సంఘం వంకతో తప్పించుకున్నారని ఆయన చెప్పారు. బాధ్యతాయుత స్థానాల్లో వుండే వారే ఇలా సమయానుకూలంగా మాటలు మారుస్తూ పోతే దేశం ఏమైపోవాలని ముఖ్యమంత్రి ఆవేదనాస్వరంతో ప్రశ్నించారు.
ఢిల్లీలో తమ గోడును వినిపించుకునే వారే లేరని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే అసంతృప్తితో వున్నాయని, ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో దృష్టితో చూసే ధోరణి ఇలానే కొనసాగితే అది విపరీత పోకడలకు దారితీస్తుందని హెచ్చరించారు.
‘‘దేశంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. నాలుగేళ్లు నిండిన నవజాత శిశువు. విభజన జరిగిన సంవత్సరం 14వ ఆర్ధిక సంఘం తిరుపతి వస్తే రాష్ట్ర సమస్యలపై ఇలాగే వినతులు ఇచ్చాం. హైదరాబాద్‌లో నేను వేసిన పునాదులే ఈరోజు దాన్నొక విజ్ఞాన సమాజంగా మార్చాయి. ఒక పాషన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ది చేశాను. కాలినడకన న్యూయార్క్‌లో ఫైళ్లు పట్టుకుని తిరిగి మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చాను. ఇప్పుడూ అంతే, కాలినడకన న్యూయార్క్‌లో వర్షంలో తడుస్తూ ఐటీ కంపెనీలను ఏపీకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రత్యేక హోదా సెంటిమెంట్
‘రాజకీయం ఏవిధంగా సామాన్య జనాన్ని దెబ్బతీస్తుందో ఉదాహరణే ఆంధ్రప్రదేశ్. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక తప్పిదం వల్ల 2% ఓట్లకు పడిపోయింది. విభజన సమయంలో ఇస్తామన్న వాగ్దానం అది. హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కొన్ని సందర్భాలలో రాజకీయ నిర్ణయాలే రాష్ట్రాల తలరాతలను నిర్ణయిస్తున్నాయి.
తుఫాన్లు, కరవు వరుస వెంబడి ప్రతిఏటా సతమతం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి ఆర్థిక సంఘానికి చెప్పారు. 52% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయం ఉండేలా విభజించారని, నాలుగేళ్లుగా ఎంత శ్రమించినా ఈ వ్యత్యాసాన్ని అధిగమించలేక పోతున్నామని అన్నారు. ‘ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్‌లో ఏపీకి ప్రధాని ఇచ్చిన వాగ్దానం. ఆ హామీ ఇచ్చినప్పుడు కొత్త ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కె సింగ్ సభలో సభ్యునిగా అక్కడే వున్నారు. నాలుగేళ్లయినా హోదా హామీని కేంద్రం నెరవేర్చలేదు. అదిప్పుడు ప్రజలలో పెద్ద సెంటిమెంట్‌గా మారింది’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఏడాది ఆర్ధికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సాయం, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరి, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రాజధానికి రోడ్, రైల్ కనెక్టివిటీ తదితర చట్టంలోని 18 అంశాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విశదీకరించారు.
వెనుకబడిన ప్రాంతాలకు రూ.22 వేల కోట్లు
రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన 7 జిల్లాలలో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఆయా ప్రాంతాలను ఆర్థికంగా కృంగదీస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర విభజన ప్రభావం ఆ ప్రాంతాలపై తీవ్రంగా వుంటుందని వివరించారు. బుందేల్‌ఖండ్ తరహా ఆర్థిక సహాయం కింద తలసరి రూ.4,115 చొప్పున వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేంద్రం రూ.2,100 కోట్లు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించి అందులో ఇప్పటి వరకు రూ.1.050 కోట్లు మాత్రమే అందించిందని ముఖ్యమంత్రి ఆర్థిక సంఘానికి వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. అభివృద్ది చెందుతున్న రాష్ట్రానికి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. 15వ ఆర్థిక సంఘం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన గ్రాంటులో రాష్ట్రానికి రూ.22,250 కోట్లు సిఫారసు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.